Begin typing your search above and press return to search.

మైఖేల్ జాక్స‌న్ బ‌యోపిక్: దేశంలో మూడో వంతు వ‌సూళ్లు సౌత్ నుంచే!

పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మైఖేల్` బయోపిక్ భారత్‌లో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

By:  Sivaji Kontham   |   26 April 2026 4:00 AM IST
మైఖేల్ జాక్స‌న్ బ‌యోపిక్: దేశంలో మూడో వంతు వ‌సూళ్లు సౌత్ నుంచే!
X

పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మైఖేల్` బయోపిక్ భారత్‌లో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 6 కోట్లు రాబట్టగా.. అందులో మూడో వంతు వసూళ్లు కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే రావడం విశేషం. అంతేకాదు జాక్స‌న్ కి తెలుగు రాష్ట్రాల్లోను విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది గ‌నుక దానికి త‌గ్గ‌ట్టే ఇక్క‌డా థియేట‌ర్ల‌లో హంగామా క‌నిపించింది. తెలుగు రాష్ట్రాలు స‌హా ద‌క్షిణాది అంత‌టా మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ అద్భుతంగా ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఉత్తర అమెరికాలో ఇప్పటికే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. అంతర్జాతీయంగా మ్యూజికల్ బయోపిక్ కేటగిరీలో సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తోంది. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సోదరుడి కుమారుడు జాఫర్ జాక్సన్ నటించడం విశేషం. జాక్సన్ బాడీ లాంగ్వేజ్.. డ్యాన్స్ స్టెప్పులను జాఫర్ అద్భుతంగా ప్రతిబింబించడంతో అభిమానులు పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినా జాక్సన్ పై ఉన్న అంతర్జాతీయ అభిమానం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెడుతోంది.

ఇండియాలో రికార్డు స్థాయి వసూళ్లు

మైఖేల్ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఆరంభం మిశ్రమ సమీక్షలు అందుకున్నా.. దాంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న అక్షయ్ కుమార్ `భూత్ బంగ్లా`, రణవీర్ సింగ్ `ధురంధర్ 2` వంటి భారీ చిత్రాల నుండి గట్టి పోటీ ఎదుర‌వుతున్నా.. మైఖేల్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మ్యూజికల్ బయోపిక్ చిత్రాల రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో ఈ సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. గురువారం నాటి పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ. 2.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు శుక్రవారం నాడు రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో మొత్తం ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 5.50 కోట్ల నెట్ (రూ. 6.60 కోట్ల గ్రాస్) కు చేరుకున్నాయి. భారత్‌లో గతంలో విడుదలైన పాపుల‌ర్‌ మ్యూజికల్ బయోపిక్‌లు ఎల్విస్, బోహేమియన్ రాప్సోడి వంటి చిత్రాల రికార్డులను `మైఖేల్' అధిగమించింది. ఇదే సమయంలో విడుదలైన అవినాష్ తివారీ, మేధా శంకర్ నటించిన `గిన్నీ వెడ్స్ సన్నీ 2`కేవలం రూ. 30 లక్షలకే పరిమితం కాగా.. హారర్ కామెడీ `భూత్ బంగ్లా`, స్పై థ్రిల్లర్ `ధురంధర్ 2` వసూళ్ల కంటే మైఖేల్ భారీ ఆధిక్యంలో ఉంది.

ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జాన్ లోగన్ స్క్రిప్ట్ అందించారు. మైఖేల్ జాక్సన్ బాల్యం.. `జాక్సన్ 5` బృందంతో క‌థానాయ‌కుడి ప్రయాణం.. గ్లోబల్ స్టార్‌గా ఎదుగుదల వంటి అంశాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. పెయిడ్ ప్రివ్యూలతో కలిపి విదేశాల్లో 30 మిలియన్ డాలర్ల ఓపెనింగ్‌ను సాధించింది. ఇందులో భారత్ నుండి వచ్చిన 700 వేల డాలర్లు కూడా ఉన్నాయి. ఉత్తర అమెరికా వసూళ్ల గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. జాఫర్ జాక్సన్‌తో పాటు నియా లాంగ్, మైల్స్ టెల్లర్, కోల్మన్ డొమింగో వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.