Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ ఫైనల్ వేళ మెహర్ రమేష్ ట్రెండింగ్

ఈ విచిత్రమైన యాంగిల్‌ను ఎవరు బయటికి తీశారో కానీ.. దీని మీద మీమ్స్ అయితే మామూలుగా లేవు.

By:  Tupaki Desk   |   19 Nov 2023 10:44 AM GMT
ప్రపంచకప్ ఫైనల్ వేళ మెహర్ రమేష్ ట్రెండింగ్
X

ప్రపంచకప్ ఫైనల్ రోజు సోషల్ మీడియాలో ఎన్నో ట్రెండ్స్ నడుస్తున్నాయి. చాలా క్రియేటివ్‌గా వీడియో ఎడిట్స్ చేయడంలో సిద్ధహస్తులైన తెలుగు నెటిజన్లు.. తమ క్రియేటివిటీని పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. తెలుగు సినిమాల్లోని అనేక సన్నివేశాలు తీసుకుని రకరకాల మీమ్స్ తయారు చేస్తున్నారు. ఐతే మిగతా మీమ్స్ అన్నీ ఒకెత్తయితే.. దర్శకుడు మెహర్ రమేష్‌ మీద వస్తున్న మీమ్స్ మరో ఎత్తు. ఆయన డిజాస్టర్ మూవీ తీసిన ప్రతిసారీ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందనే సెంటిమెంట్ మీద మీమ్స్ కుప్పలు తెప్పలుగా వస్తుండటం విశేషం. మెహర్ అన్న కప్పు గెలిపిస్తాడు, భయపడకండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విచిత్రమైన యాంగిల్‌ను ఎవరు బయటికి తీశారో కానీ.. దీని మీద మీమ్స్ అయితే మామూలుగా లేవు.

2011లో మెహర్ రమేష్ ‘శక్తి’ అనే ఆల్ టైం డిజాస్టర్ తీశాడు. ఆ సంవత్సరం ఇండియా వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. ధోని నాయకత్వంలో కప్పు అందుకుని సగర్వంగా నిలబడింది. ఇక 2013లో మెహర్ రమేష్ నుంచి ‘షాడో’ అనే మరో పెద్ద డిజాస్టర్ వచ్చింది. ఆ ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. మెహర్ రమేష్ ఆ తర్వాత పదేళ్ల పాటు ఏ సినిమా తీయలేదు. ఈ టైంలో ఇండియా ఏ ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఐతే ఈ ఏడాది మెహర్ నుంచి వచ్చిన ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీనికి లింక్ కలుపుతూ.. మెహర్ ఇన్నేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు కాబట్టి ఈ ఏడాది కూడా ఇండియా ప్రపంచకప్ గెలుస్తుంది, టెన్షన్ పడకండి అంటూ నెటిజన్లు మీమ్స్ మోత మోగిస్తున్నారు. నిన్నట్నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. అంతకంతకూ దాని మీద మీమ్స్ పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇండియా కప్పు గెలిస్తే ఈ మీమ్స్ మరింత మోతెక్కిపోతాయేమో.