Begin typing your search above and press return to search.

వెండితెర రారాజు..మెగా మ‌హారాజు @ 68!

తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని శ్వాసించి..శాషిస్తోన్న చిరంజీవి గురించి ఎంత చెప్పినా త‌క్కువే

By:  Tupaki Desk   |   22 Aug 2023 8:42 AM GMT
వెండితెర రారాజు..మెగా మ‌హారాజు @ 68!
X

వెండితెర రారాజులా.. మెగా మహారాజులా..'స్వయంకృషి'కి చిరునామాలా.. అభిమానుల 'విజేత‌'గా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అభిమానుల హృద‌య‌మే ఆయ‌న ఊరు. ఎప్ప‌టికీ నిలిచిపోయే కీర్తి సంత‌కం. హిమాల‌యాల్నే త‌ల‌ద‌న్నే ఆయ‌న వ్య‌క్తిత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శ‌క్తి ఆయ‌న సొంతం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ర్శియ‌ల్ స్టాండ‌ర్స్డ్ ని ఎల్ల‌లు దాటించిన వెండి తెర ఇల‌వేల్పు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ శిఖరంలా ఎదిగిన న‌టుడాయ‌న‌. ఆ ఇంద్రుడ‌ని ఆద‌ర్శంగా తీసుకుని ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన వారెంతో మంది. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అన్నయ్య గురించి ప్ర‌త్యేకంగా..

తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని శ్వాసించి..శాషిస్తోన్న చిరంజీవి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న క‌ష్టంతో ఎదిగిన న‌టుడు కాదు..ఇష్టంతో ఎదిగిన న‌టుడు. అందుకే ఆ స్థాయికి చేరుకున్నారు. 'పునాది రాళ్లు' నుంచి మొన్న‌టి 'భోళా శంక‌ర్' వ‌ర‌కూ అన్న‌య్య జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలున్నాయి. సాధార‌ణ శివ శంక‌ర ప్ర‌సాద్ మెగాస్టార్ చిరంజీవిగా మారాడంటే దాని వెనుక ఎంతో క‌ష్టం..కృషి ప‌ట్టుద‌ల ఉన్నాయి.

చిన్న‌త‌నం నుంచి సినిమాలంటే ఆస‌క్తి. ఆ ఫ్యాష‌న్ తోనే చ‌దువు పూర్తిచేసుకుని 1976 లో చెన్నై వెళ్లి అక్క‌డే న‌ట‌న‌లో మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో శిక్ష‌ణ తీసుకున్నారు. 1978లో 'పునాది రాళ్లు' సినిమాతో హీరోగా మారారు. కానీ ఈ సినిమా కంటే ముందు 'ప్రాణం ఖరీదు' అనే సినిమా రిలీజ్ అయ్యింది. అటుపై బాపు దర్శకత్వంలో వచ్చిన 'మనవూరి పాండవులు' సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది.

మెగాస్టార్ కాక ముందు చిరంజీవి మంచి ప్ర‌తినాయ‌కుడు కూడా. 1976 లో 'ఐల‌వ్ యూ' అనే సినిమాలో నెగిటివ్ పాత్ర‌లో న‌టించారు. ఆ ఏడాది చిరంజీవి న‌టించిన 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ త‌ర్వాత మెగాస్టార్ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఎన్టీఆర్..కృష్ణ‌..ఏఎన్నార్ లాంటి స్టార్లు ఉన్నా చిరంజీవి త‌న‌దైన మార్క్ తో దూసుకుపోయారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

ఇక న‌టుడిగా తాను సాధించాల్సిందంతా సాధించారు. ఈ స‌మ‌యంలో మ‌న‌సు రాజ‌కీయాల్ని కోరుకుంది. ఆ రంగంలోనూ రాణించాల‌ని..ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని ఆశ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ రాజ‌కీయంగా ఆయ‌న జ‌ర్నీ సంతోషంగా సాగ‌లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. అటుపై మ‌ళ్లీ 'ఖైదీ నెంబ‌ర్ 150' తో బాస్ కంబ్యాక్ అయిన వైనం తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యారు. స్వాతంత్ర స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని 'సైరా న‌ర‌సింహారెడ్డి'గా తెర‌కెక్కించి మెగాస్టార్ కొత్త ఇమేజ్ని సొంతం చేసుకున్నారు.