ఆయనే స్ఫూర్తి.. ఉగాది సందర్భంగా పేదవారికి శుభవార్త తెలిపిన చిరంజీవి.. వీడియో వైరల్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ పేరు సొంతం చేసుకున్న చిరంజీవి.. తన సినిమాలతోనే కాకుండా సేవా గుణంతో కూడా అందరి హృదయాలలో నిలిచిపోయారు .
By: Madhu Reddy | 19 March 2026 3:50 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ పేరు సొంతం చేసుకున్న చిరంజీవి.. తన సినిమాలతోనే కాకుండా సేవా గుణంతో కూడా అందరి హృదయాలలో నిలిచిపోయారు .ఇప్పటికే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు వంటి సేవలతో వేలాది మందికి సహాయం అందిస్తున్న చిరంజీవి.. నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు శుభవార్త తెలుపుతూ విద్యాదానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే ఇకపై తన అడుగులు అటువైపే అంటూ భరోసా ఇచ్చారు.
ఉగాది సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.." రక్తం కొరత కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినప్పుడు.. రక్తం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని..నా అభిమానులందరినీ రక్తదానంలో పాల్గొనేలా ప్రేరేపించాల్సిన సమయం వచ్చిందని నాకు అనిపించి.. 1998లో బ్లడ్ బ్యాంకు ను స్థాపించడం జరిగింది. అదే సమయంలో ఐ బ్యాంకు సేవలను కూడా ప్రారంభించాము. నా అభిమాన సంఘాల ద్వారా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము.అత్యవసర సమయంలో మేము స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంకు ప్రాణదాతగా నిలుస్తోంది.
అయితే నేను కేవలం ఈ బ్లడ్ బ్యాంకు తోనే నా సేవలను నిలిపివేయాలని అనుకోలేదు. భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యను ఎలా అందించాలనే దానిపైనే ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రముఖ నటుడు సూర్య "అగరం ఫౌండేషన్" ను స్థాపించారు. ఇప్పుడు నేను ఆయన నుండి స్ఫూర్తి పొంది ఉచిత విద్యా బోధనను ప్రారంభించాలనుకుంటున్నాను. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఎక్కడైతే విద్య అవసరం ఉంటుందో అక్కడ ఉచిత విద్యను అందించే దిశగా నేను కృషి చేస్తాను". అంటూ విద్యార్థులకు, పేదవారికి తన వంతు హామీ ఇచ్చారు.. ఇక త్వరలోనే ఈ విద్యా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించబడతాయి అంటూ చిరంజీవి తెలిపారు. ఈ ఉగాది సందర్భంగా పేదవారి కోసం ప్రకటించిన ఈ కొత్త హామీ అందరికీ హర్షదాయకంగా మారింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన గొప్ప మనసును మరొకసారి గుర్తు చేస్తూ ఆయనను కొనియాడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల విషయానికి వస్తే.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు వంటి సేవలతో వేలాదిమంది సహాయం పొందుతున్నారు. సినీ అభిమానులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, వైద్య సహాయం వంటివి చేసి ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలిచారు . ఇటీవల కేంద్రం నుండి ఎఫ్ సి ఆర్ ఏ ఆమోదం పొంది విదేశీ విరాళాలతో సేవల విస్తరణకు కృషి చేశారు చిరంజీవి. అలాగే చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు, కార్మికులకు తన ట్రస్టు ద్వారా ఆర్థిక , వైద్య సహాయం అందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ ట్రస్టు బాధ్యతలను రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకమైన వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ ఒకవైపు సినిమాలు మరొకవైపు సేవా కార్యక్రమాలతో అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చు.
