మెగాస్టార్ సినిమాకు కూడా తప్పట్లేదుగా!
మెగా157 సినిమాకు కూడా వచ్చింది. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అలప్పుజాలో అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది.
By: Tupaki Desk | 19 July 2025 2:13 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య లీకుల బెడద బాగా ఎక్కువైపోయింది. దర్శకనిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్ టైమ్ లో లొకేషన్స్ నుంచి కొంత కంటెంట్ బయటకు వస్తూనే ఉంటుంది. బయటికొచ్చిన కంటెంట్ క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. ఈ లీకుల బెడద చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ అన్నింటినీ వేధిస్తుంది.
ఇప్పుడీ లీకుల సమస్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా157 సినిమాకు కూడా వచ్చింది. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అలప్పుజాలో అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది. తాజాగా కేరళ షెడ్యూల్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో, కొన్ని ఫోటోలు లీకయ్యాయి.
ఈ లీకులపై నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ స్పందిస్తూ ఓ నోట్ ను రిలీజ్ చేస్తూ అసహనం వ్యక్తం చేశాయి. పర్మిషన్ లేకుండా సెట్స్ నుంచి కంటెంట్ ను షూట్ చేసి దాన్ని లీక్ చేయడం ఆపాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. సినిమా కోసం తామెంతో కష్టపడుతున్నామని, ఇలాంటి లీకులు జరిగితే తమ కష్టమంతా వృధా అవుతుందని, సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ ను ఈ లీకులు నాశనం చేస్తాయని మేకర్స్ తెలిపారు.
లీకైన కంటెంట్ ను ఎవరైనా షేర్ చేసినా, ఎక్కడైనా అప్‌లోడ్ చేసినా వాటిని గుర్తించి వారికి కాపీరైట్ వేయడంతో పాటూ పైరసీ వ్యతిరేక చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని మేకర్స్ హెచ్చరించారు. తామెంతో ప్రేమతో తెరకెక్కిస్తున్న మెగా157 సినిమాకు ఆడియన్స్ కూడా మద్దతు ఇవ్వాలని, ఇలాంటి లీకులను ఎంకరేజ్ చేయకూడదని నిర్మాతలు కోరారు.
కాగా మెగా157 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. చిరంజీవి కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయనుండగా, కేథరీన్ థ్రెసా కీలక పాత్రలో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా అనిల్ రావిపూడి షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.
