Begin typing your search above and press return to search.

2026లో మెగాస్టార్ హ్యాట్రిక్‌... కాస్కోండి నా సామిరంగా..!

చిరు - బాబి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాను కూడా ద‌స‌రాకు రిలీజ్ అనుకుంటున్నారు. ఆల్రెడీ వాల్తేరు వీర‌య్య సూప‌ర్ హిట్ అయ్యాక‌.. వీరి కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2025 6:03 AM IST
2026లో మెగాస్టార్ హ్యాట్రిక్‌... కాస్కోండి నా సామిరంగా..!
X

ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. రీ ఎంట్రీ త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150 సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత ఆచార్య డిజాస్ట‌ర్‌, గాడ్ ఫాద‌ర్ అంచ‌నాలు అందుకోలేదు. వాల్తేరు వీర‌య్య హిట్ అయితే భోళా శంక‌ర్ బాగా నిరాశ ప‌రిచింది. ఈ సినిమా త‌ర్వాత దాదాపు యేడాది పాటు చిరును వెండి తెర‌మీద చూడ‌లేదు. వాస్త‌వానికి విశ్వంభ‌ర సినిమా ఈ యేడాదే థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా కావ‌డంతో పాటు కొన్ని రీ షూట్లు చేయాల్సి రావ‌డం ఇవ‌న్నీ క‌లిసి ఈ సినిమా న‌త్త‌న‌డ‌కకు కార‌ణ‌మ‌య్యాయి. దీంతో విశ్వంభ‌ర 2026 స‌మ్మ‌ర్‌కు వెళ్లిపోయింది. చిరు కూడా ఒకానొక టైంలో విశ్వంభ‌ర విష‌యంలో ఏమంత ఆస‌క్తి చూపించ‌లేదు.

మ‌ధ్య‌లో అనిల్ రావిపూడి సినిమా సెట్ కావ‌డంతో చిరు ఆస‌క్తి అంతా ఈ సినిమా మీదే ఉండిపోయింది. అలా మ‌న శంక‌ర‌వ‌ర ప్ర‌సాద్ గారు వ‌చ్చే సంక్రాంతికి శ‌ర‌వేగంగా ముస్తాబు అవుతోంది. ఈ క్ర‌మంలోనే 2026లోనే చిరు మూడు సినిమాల‌తో హ్యాట్రిక్ కొట్ట‌నున్నారు. ముందుగా సంక్రాంతికి మ‌న శంకరవ‌ర ప్ర‌సాద్ గారు వ‌స్తుంది. స‌మ్మ‌ర్‌లో విశ్వంభ‌ర రిలీజ్‌కు రెడీ అవుతోంది. విశ్వంభ‌ర షూటింగ్ ఇప్ప‌టికే కంప్లీట్ అయ్యింది. చిన్న ప్యాచ్ వ‌ర్క్‌లు పూర్తి చేసి స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేస్తున్నారు. బింబిసార‌తో మెప్పించిన మ‌ల్లిడి వ‌శిష్ట్ రెడ్డి ఈ సినిమా ద‌ర్శ‌కుడు.

ఈ రెండు సినిమాలు కాకుండా చిరు నుంచి వ‌చ్చే యేడాదే ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా వ‌స్తోంది. చిరు - బాబి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాను కూడా ద‌స‌రాకు రిలీజ్ అనుకుంటున్నారు. ఆల్రెడీ వాల్తేరు వీర‌య్య సూప‌ర్ హిట్ అయ్యాక‌.. వీరి కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాను చ‌క‌చ‌కా పూర్తి చేసి అయితే ద‌స‌రా లేక‌పోతే దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్‌. ఏదేమైనా 2025లో చిరు నుంచి ఒక్క సినిమా రాక‌పోయినా 2026లో మాత్రం వ‌డ్డీతో స‌హా తీర్చేయ‌బోతున్నాడు చిరు. ఇక మెగా ఫ్యాన్స్‌ను వ‌చ్చే యేడాది ఈ వ‌రుస పండ‌గ‌ల‌తో అస్స‌లు ఆప‌లేం క‌దా..! మ‌రో ఇంట్ర‌స్టింగ్ ఏంటంటే చిరు - ద‌స‌రా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా 2026లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.