Begin typing your search above and press return to search.

ఫేవ‌రెట్ల‌ పై కోపంతో ఐపిఎల్‌కి అడిక్ట్ అయిన మెగా ఫ్యాన్స్!

టాలీవుడ్‌లో తిరుగులేని మార్కెట్, అభిమానగణం ఉన్న మెగా కాంపౌండ్ హీరోల తాజా చిత్రాల విడుదల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Sivaji Kontham   |   23 May 2026 10:00 AM IST
ఫేవ‌రెట్ల‌ పై కోపంతో ఐపిఎల్‌కి అడిక్ట్ అయిన మెగా ఫ్యాన్స్!
X

టాలీవుడ్‌లో తిరుగులేని మార్కెట్, అభిమానగణం ఉన్న మెగా కాంపౌండ్ హీరోల తాజా చిత్రాల విడుదల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నా.. కొన్ని పూర్తయినా.. ఇప్పటివరకు రిలీజ్ డేట్లపై స్పష్టత రాకపోవడంతో మెగా అభిమానులు తమ ఫేవరెట్ హీరోలపై తీవ్ర అలక పూనారు. దీనికి ప్రధాన కారణం సదరు చిత్రాల ఓటీటీ (డిజిటల్) లేదా ఇత‌ర బిజినెస్ క్లోజ్ కాకపోవడమేనని ఇండస్ట్రీ టాక్. బెస్ట్ డిజిటల్ డీల్స్ కోసం నిర్మాతలు పట్టుబట్టడం, మార్కెట్ సమీకరణాల వల్ల బిజినెస్ ఆలస్యం కావడం థియేట్రికల్ రిలీజ్‌లను సందిగ్ధంలో పడేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `విశ్వంభర`, సాయి దుర్గా తేజ్ `సంబరాల ఏటి గట్టు`, వరుణ్ తేజ్ `కొరియన్ కనకరాజు` చిత్రాలు ఈ డిజిటల్ డీల్స్ లూప్‌లోనే చిక్కుకున్నాయని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో సంచలనం సృష్టించిన `జగదేకవీరుడు అతిలోకసుందరి` రేంజ్‌లో ఈ సినిమా విజువల్స్ ఉంటాయని మేకర్స్ ప్రచారం చేశారు. అయితే చిత్రంలో భారీ గ్రాఫిక్స్ (వీఎఫ్ఎక్స్) వర్క్ కారణంగా ఇప్పటికే సినిమా నిర్మాణం చాలా ఆలస్యమైంది. దీనికి తోడు డిజిటల్ రైట్స్ ఆశించిన భారీ మొత్తానికి అమ్ముడుపోకపోవడంతో మేకర్స్ ఇంకా అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. వచ్చే ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ, బిజినెస్ క్లోజ్ కాకుండా ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ నిరంతర జాప్యంతో విసిగిపోయిన మెగా ఫ్యాన్స్, అప్‌డేట్స్ ఇవ్వడం లేదంటూ మేకర్స్‌పై గుర్రుగా ఉన్నారు.

మరోవైపు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `సంబరాల ఏటి గట్టు`. ఈ సినిమా చిత్రీకరణ కూడా అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. సినిమా బడ్జెట్ పరిమితులు దాటడంతో పెండింగ్ ఉన్న షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేయడానికి.. సినిమాను సురక్షితంగా థియేటర్లలోకి తీసుకురావడానికి డిజిటల్ డీల్ అత్యవసరంగా మారింది. అయితే నిర్మాతలు కోరుతున్న భారీ ప్రైజ్ కి ఓటీటీ సంస్థలు ముందుకు రాకపోవడంతో ఈ డీల్ పెండింగ్‌లో పడిందని చెబుతున్నారు. ఈ మూవీ విడుద‌ల‌ ఆలస్యానికి కేవలం డిజిటల్ బిజినెస్ మాత్రమేనా లేక `విశ్వంభర` లాగే విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) కూడా కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస వాయిదాలతో సాయి తేజ్ అభిమానులు సైతం తీవ్ర విసుగు చెందుతున్నారు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న `కొరియన్ కనకరాజు` సినిమా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తిగా ముగిసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ షెడ్యూళ్లతో కూడుకున్న ఈ చిత్ర విడుదల ఆలస్యానికి కూడా ఓటీటీ డీల్స్ పెండింగ్‌లో ఉండటమే కారణమని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఇటీవలి చిత్రాల సక్సెస్ రేట్ (ట్రాక్ రికార్డ్) ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఈ చిత్ర బిజినెస్‌కు కొంత ఇబ్బందికరంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించాలంటే డిజిటల్ డీల్ క్లోజ్ కావడం మేకర్స్‌కు అనివార్యమైంది. మొత్తానికి ఈ ముగ్గురు మెగా హీరోల ప్రాజెక్టులు ప్రస్తుతం ఒకే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటుండగా.. ఈ ప్రతిష్టంభన వీడి సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో చూడాలి. మ‌రోవైపు మెగాఫ్యాన్స్ విసుగు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ ఐపిఎల్ సీజ‌న్ ని విప‌రీతంగా ఆద‌రిస్తున్నారు!