Begin typing your search above and press return to search.

చిరు 'మెగా 158'.. అస్సలు లేట్ చేయకుండా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   22 May 2026 3:17 PM IST
చిరు మెగా 158.. అస్సలు లేట్ చేయకుండా..
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఆ మూవీని గ్రాండ్ గా లాంఛ్ చేసిన మేకర్స్, మరుసటి రోజే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పూజా కార్యక్రమం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సెట్స్‌ పైకి వెళ్లడం చూస్తుంటాం.

కానీ మెగా 158 మాత్రం పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టడం చూస్తే, ప్రాజెక్టు విషయంలో టీమ్ ఎంత క్లారిటీ గా ఉందో అర్థమవుతోంది. హైదరాబాద్‌ లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో శుక్రవారం ఉదయం షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ఇందులో చిరంజీవితో పాటు యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కూడా సెట్స్‌ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

దీంతో సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్న విషయం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక మెగా 158 లాంఛింగ్ మెగా అభిమానులకు ఒక ప్రత్యేక వేడుకలా మారింది. పవన్ కళ్యాణ్ స్వయంగా కొబ్బరికాయ కొట్టి సినిమాను ప్రారంభించగా, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురు ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.

అలాగే సీనియర్ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ వంటి ప్రముఖులు హాజరు కావడం విశేషం. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు కూడా వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా 158 సినిమా గురించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్‌ లో వస్తున్న రెండో చిత్రం కావడం. ఆ సినిమా కమర్షియల్‌ గా భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు మెగా 158పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈసారి కూడా ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ చిత్రంలో మాలీవుడ్ స్టార్ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రియమణి, అనురాగ్ కశ్యప్ కూడా నటించే అవకాశాలపై చర్చ నడుస్తోంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక దర్శకుడు బాబీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. తాను కూడా చిరంజీవి అభిమానినేనని చెప్పిన ఆయన, ఫ్యాన్స్ చూపించిన ప్రేమతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. పాత తరం అభిమానులతో పాటు ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను కూడా మెప్పించేలా సినిమా ఉంటుందని బాబీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, సంక్రాంతి టార్గెట్‌ తో సినిమాను వేగంగా పూర్తి చేయాలనే ప్లాన్‌ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ విషయంలో అస్సలు ఆలస్యం చేయకుండా ముందుకెళ్తుండటంతో, మెగా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.