పాక్ నటికి షాకిచ్చిన బాలీవుడ్
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ మూవీ సనమ్ తేరీ కసమ్2 నుంచి పాకిస్తాన్ నటి మావ్రా హోకెన్ ను తప్పిస్తున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
By: Tupaki Desk | 12 May 2025 7:15 PM ISTపహల్గామ్ ఉగ్రదాడి వల్ల దేశంలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రతీ విషయంలో ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సినీ ఇండస్ట్రీలో మన దేశానికి చెందిన వాళ్లే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్లు కూడా వర్క్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే పాక్ నటీనటులు కూడా ఇండియన్ సినిమాలో కొంతమంది నటిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి, దాన్ని తిప్పి కొడుతూ ఇండియన్ ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పలువురు పాక్ ఆర్టిస్టులపై ఇండియన్ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిషేధం విధించింది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ మూవీ సనమ్ తేరీ కసమ్2 నుంచి పాకిస్తాన్ నటి మావ్రా హోకెన్ ను తప్పిస్తున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
పాకిస్తాన్ తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశమే ప్రధానమని చెప్తూ ఆమెను తొలగిస్తూ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా నిస్సందేహంగా ఖండిస్తామని కూడా చిత్ర మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే ఆ సినిమాలో హీరోగా నటించిన హర్షవర్ధన్ రాణే గతంలోనే ఆమె ఉంటే నటించేది లేదని స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్ పై మావ్రా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హర్షవర్ధన్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో తన దేశాన్ని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తానొక నిర్ణయానికి వచ్చానని, గతంలో నటించిన వాళ్లే సనమ్ తేరీ కసమ్2 లో కూడా నటిస్తానంటే తాను అందులో నటించాలనుకోవడం లేదని రాసుకొచ్చాడు.