చైనాతో వార్ వచ్చే వరకూ సైలెన్స్ ఉత్తమం!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దేశభక్తి, సరిహద్దు ఘర్షణల నేపథ్యంతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
By: Srikanth Kontham | 24 May 2026 5:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో దేశభక్తి, సరిహద్దు ఘర్షణల నేపథ్యంతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు శత్రుదేశాలైన పాకిస్తాన్ లేదా చైనా పేర్లను నేరుగా వాడుతూ వారిపై పోరాడే వీరుల కథలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించేవారు. ఆయా దేశాలతో వాణిజ్యపరంగా గానీ, దౌత్యపరంగా గానీ పెద్దగా ఒరిగేదేమీ లేకపోవడంతో మేకర్స్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా శత్రువులను తెరపై బహిరంగంగానే చూపించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
ప్రస్తుతం చైనాతో భారత్ స్నేహపూర్వక , వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తున్న వేళ చిత్ర పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు సినిమాల్లో చైనా పేరును నేరుగా వాడటం, వారిని విలన్లుగా చూపించడం అంత సులువైన విషయం కాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. వెండితెరపై దేశభక్తిని చాటాలనుకునే దర్శకులకు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య నీతి పెద్ద అడ్డంకిగా మారింది. సరిహద్దు రాజకీయాల సందిగ్ధతకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `మాతృభూమి` ఉదాహరణగా నిలిచింది.
గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో అవస్థలు పడుతోంది. చైనా ప్రస్తావనలు, ఘర్షణల తీవ్రతను నేరుగా చూపించొద్దనే నిబంధనల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనిపించడం లేదు. భారీ బడ్జెట్ సినిమా అయినా? భౌగోళిక రాజకీయాల కారణంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటోంది. సల్మాన్ ఖాన్ చిత్రం ఇలాంటి ఇబ్బందులు పడుతుండగానే? గాల్వాన్ ఘర్షణల ఆధారంగానే రావాల్సిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఏకంగా రద్దయినట్లు సమాచారం. సీనియర్ నటి భాగ్యశ్రీ భర్త, నిర్మాత హిమాలయ్ దస్సాని తన కుమారుడు అభిమన్యు దస్సానిని హీరోగా `ది లయన్ ఆఫ్ గాల్వాన్` అనే సినిమాను భారీ ఎత్తున నిర్మించేందుకు సన్నాహాలు చేశారు.
గాల్వాన్ లోయలో వీరోచితంగా పోరాడిన భారత సైనికుల గాథను ప్రపంచానికి చూపించాలనేది వారి సంకల్పం.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా పేరును నేరుగా ప్రస్తావించలేని పరిమితుల కారణంగా ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజ జీవితంలో జరిగిన చారిత్రాత్మక ఘర్షణను చూపిస్తూ అసలు శత్రువు ఎవరో స్పష్టంగా చెప్పకుండా సినిమా తీస్తే అందులో సహజత్వం లోపిస్తుందని భావించారు. కథలోని ఆత్మను చంపుకుని దౌత్యపరమైన సర్దుబాట్లతో సినిమా తీయడం కంటే ప్రాజెక్టును నిలిపివేయడమే ఉత్తమమని నిర్మాతలు భావించడం గమనార్హం. చైనాతో మళ్లీ యుద్దం వస్తే? తప్ప దర్శక, నిర్మాతలు సాహసం చేసే పరిస్థితి కనిపించలేదు.
