రాజమౌళి సినిమాతో మాకెలాంటి సంబంధం లేదు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈగ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 14 May 2025 7:05 AMదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈగ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. నాని హీరోగా నటించిన ఆ సినిమా గురించి అప్పట్లో అందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. ఒక ఈగతో ఇలాంటి మ్యాజిక్ చేయొచ్చా అని ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా రాజమౌళి ఆ సినిమాను తీసి తన సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే ప్రేమలు మూవీలో నటించిన మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో ఇప్పుడు లవ్లీ అనే సినిమా వస్తోంది. మే 16న ఈ సినిమా మలయాళంతో పాటూ తెలుగు లో కూడా రిలీజ్ కానుంది. ఈగతో ఓ మనిషికి ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ సినిమాను రాజమౌళి ఈగతో పోలుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తుండగా, వాటిపై మాథ్యూ స్పందించాడు.
లవ్లీ సినిమా చాలా విభిన్నమైన కథతో రూపొందిందని, ఒక మనిషికి, ఈగకు మధ్య ఉండే స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని అందరి మనసుని హత్తుకునేలా చూపించామని, లవ్లీ చూశాక అందరకీ ఓ ఫీల్‌గుడ్ సినిమా చూశామనే మంచి అభిప్రాయం కలుగుతుందని, ఎంతో సరదాగా ఉండే ఈ సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పాడు.
లవ్లీ ట్రైలర్ చూసి అందరూ రాజమౌళి ఈగ సినిమాతో పోలుస్తున్నారు. ఈగ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది. ఆ సినిమాలో ఈగనే హీరో. కానీ తమ సినిమాలో ఈగ హీరో కాదని, ఈగ పేరు లవ్లీ కావడంతో తమ సినిమాకు లవ్లీ అనే పేరుని పెట్టామని.. సినిమా చూశాక ప్రతీ ఒక్కరికీ ఈ టైటిల్ పర్ఫెక్ట్ అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు మాథ్యూ థామస్.
ఈ సందర్భంగా బ్రొమాన్స్ సినిమాలో తన యాక్టింగ్ పై వచ్చిన విమర్శలపై కూడా మాథ్యూ మాట్లాడాడు. ఆ సినిమాలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా కనిపించిన తన నటన కొన్ని సీన్స్ లో బాలేదని చాలా మంది కామెంట్స్ చేశారని, కానీ తాను మాత్రం ఆ పాత్రకు అనుగుణంగానే నటించానని చెప్పాడు. అయితే సినిమా రిలీజై తన యాక్టింగ్ పై వచ్చిన విమర్శలు విన్న తర్వాత సినిమా చూస్తే తనక్కూడా కాస్త ఓవర్ గా నటించినట్టు అనిపించిందని మాథ్యూ చెప్పాడు.