Begin typing your search above and press return to search.

మాస్ రాజా హిట్ కాంబోకి బ్రేకులా?

ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్కెట్ ను చూసిన రవితేజకు టైగర్ నాగేశ్వరరావు తో మరోసారి ఆ టార్గెట్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 9:46 AM GMT
మాస్ రాజా హిట్ కాంబోకి బ్రేకులా?
X

మాస్ మహారాజా రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని ట్రాక్ లోకి రావాలని అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది. దీంతో నెక్స్ట్ సినిమాతో రవితేజ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అంతకు ముందు వచ్చిన రావణాసుర సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.

ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్కెట్ ను చూసిన రవితేజకు టైగర్ నాగేశ్వరరావు తో మరోసారి ఆ టార్గెట్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు అతని ఫోకస్ ఈగల్ సినిమా ప్రమోషన్స్ పైన ఎక్కువగా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

అయితే సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని గాసిప్స్ వచ్చినప్పటికీ కూడా అందులో ఎలాంటి నిజం లేదు అని నిర్మాతలు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. అయితే రవితేజ కొత్తగా స్టార్ట్ చేయబోయే ఒక సినిమాకు సడన్ గా బ్రేకులు పడ్డట్లుగా తెలుస్తోంది.

వరుస విజయాలతో రవితేజతో బెస్ట్ కాంబో అనిపించుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకోగా అది ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. వీరి కలయికలో ఇంతకుముందు డాన్ శీను బలుపు క్రాక్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో మరొక మాస్ యాక్షన్ సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ గురువారం సినిమా షూటింగ్ కూడా మొదలు కావాల్సింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా కాకుండా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అవుతుందనే కారణం చేత మళ్లీ కొత్త తరహా ప్లానింగ్ తో వెళ్ళాలి అని నిర్మాత డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని ఇదే ప్రొడక్షన్లో ఇంతకుముందు వీరసింహారెడ్డి సినిమా చేశాడు. ఆ సినిమాకు కూడా బడ్జెట్ ఎక్కువ అయింది అని అభిప్రాయాలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెద్దగా నష్టాలను కలిగించలేదు. అయితే ఈసారి రవితేజ సినిమా విషయంలో అలా రిస్కు తీసుకోవద్దు అని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.