Begin typing your search above and press return to search.

మాస్ రాజా టైగ‌ర్‌ని అక్క‌డ తొక్కేసే కుట్ర జ‌రుగుతోందా?

త‌మిళ స్టార్లు న‌టించిన సినిమాల‌పై మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించ‌కుండా బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 11:30 AM GMT
మాస్ రాజా టైగ‌ర్‌ని అక్క‌డ తొక్కేసే కుట్ర జ‌రుగుతోందా?
X

సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు మ‌హారాజ పోష‌కులు అన్న‌ది ప్ర‌తి సంద‌ర్భంలోనూ నిరూపించ‌బ‌డింది. క‌రోనా కార‌ణంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా?..మ‌ళ్ళీ భార‌తీయ సినిమాకు మునుప‌టి రోజులు వ‌స్తాయా? అని మేక‌ర్స్‌, స్టార్స్ భ‌యంతో ఆందోళ‌న చెందుతున్న వేళ తెలుగు ప్రేక్ష‌కులు మీకు మేమున్నాం అంటూ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. మేక‌ర్స్‌లో ఉన్న భ‌యాల‌ని ప‌టాపంచ‌లు చేసి భార‌తీయ సినిమాకు మేమున్నామంటూ అభ‌యాన్నిచ్చారు. ఆ త‌రువాతే ఇత‌ర భాష‌ల్లో సినిమాల విష‌యంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి.

తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఆద‌ర్శింగా తీసుకుని అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిల‌వ‌డంతో మ‌ళ్లీ ప‌రిస్థితులు యదాస్థితికి వ‌చ్చేశాయి. ఇంతగా ఇండియ‌న్ సినిమాకు నూత‌న జ‌వ‌స‌త్వాల‌తో పాటు అభ‌య హ‌స్తాన్ని అందించిన తెలుగు వారి ప‌ట్ల, తెలుగు సినిమాల ప‌ట్ల ఇప్ప‌టికీ ఓ స్టేట్‌లో వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంది. అది మ‌రెక్క‌డో కాదు త‌మిళ‌నాట‌. త‌మిళ స్టార్లు న‌టించిన సినిమాల‌పై మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించ‌కుండా బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

కానీ అక్క‌డ మాత్రం మ‌న సినిమాల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. క‌నీసం థియేట‌ర్లు కూడా ల‌భించ‌ని విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయంటే తెలుగు సినిమాకు త‌మిళ‌నాట ఏ స్థాయిలో అవ‌మానం జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వాపోతున్నాయి. పేరు కూడా తెలియ‌ని ప‌ర భాషా హీరోల సినిమాలకు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే మ‌న వాళ్ల సినిమాల‌పై మాత్రం త‌మిళ ఇండ‌స్ట్రీలో వివక్ష కొన‌సాగుతోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి ప్ర‌త్య‌క్ష సాక్షిగా మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన పాన్ ఇండియా మూవీ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.

ర‌వితేజ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'. స్టూవ‌ర్ట్ పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా రూపొందిన‌ బ‌యోపిక్ ఇది. దీన్ని పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. హిందీలో భారీ స్థాయిలో ప్ర‌మోట్ చేస్తూ ర‌వితేజ కెరీర్‌లోనే భారీ స్థాయిలో అక్క‌డ‌ రిలీజ్ చేస్తున్నారు. థియేట‌ర్లు కూడా భారీ స్థాయిలో సెట్ అయ్యాయి. అయితే త‌మిళ‌నాట మాత్రం టైగ‌ర్‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయని తెలుస్తోంది. ఓ మోస్తారు స్థాయిలో కూడా అక్క‌డ టైగ‌ర్‌కు థియేట‌ర్లు దొరికే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అక్క‌డ పెద్ద సంస్థ‌లు టైగ‌ర్ రిలీజ్‌కు ముందుకు రాక‌పోవ‌డమే అక్క‌డ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. తెలుగు సినిమాకు మించి త‌మిళ సినిమాకే అక్క‌డి వారు ప్రాధాన్య‌త‌నివ్వ‌డంతో టైగ‌ర్‌కు అక్క‌డ క‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. టైగ‌ర్ రిలీజ్ స‌మ‌యంలోనే ద‌ళ‌ప‌తి విజ‌య్ - లోకేష్ క‌న‌గ‌రాజ్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'లియో' రిలీజ్ కాబోతోంది. దీంతో అక్క‌డి థియేట‌ర్ల‌న్నీ 'లియో'కే కేటాయించారు. దీంతో 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'కు థియేట‌ర్ల స‌మ‌స్య ఏర్ప‌డింది. ఈ గండం నుంచి గ‌ట్టెక్కాలంటే అక్క‌డ ఉద‌య‌నిధి స్టాలిన్ లాంటి వారు కానీ, లైకా వారు కానీ పూనుకోవాల్సిందే. కానీ ఆ ప‌రిస్థితులు మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డంతో మాస్‌రాజా అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.