Begin typing your search above and press return to search.

రవితేజ.. ఇది కదా ఎదుగుదలంటే

హిందీ ప్రేక్షకుల్లో చాలామందికి ఆ సినిమాల ఒరిజినల్ హీరో రవితేజ అని తెలియదు. ఈ విషయాన్ని మీడియా వాళ్ల ద్వారా జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేశాడు అనుపమ్

By:  Tupaki Desk   |   5 Oct 2023 2:30 PM GMT
రవితేజ.. ఇది కదా ఎదుగుదలంటే
X

మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్లో ఎంతో స్ఫూర్తినిచ్చే ఎదుగుదల అంటే మాస్ రాజా రవితేజదే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేసి.. ఆపై విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో మెరిసి.. చివరగా సోలో హీరో అవతారం ఎత్తి స్టార్ ఇమేజ్ సంపాదించి పెద్ద రేంజికి ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తినిచ్చేదే. టాలీవుడ్లో ఎంతోమంది యువ దర్శకులను పరిచయం చేసిన ఘనత రవితేజ సొంతం.

రవితేజను చూసి ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు.. ఇక్కడ నిలదొక్కుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. హీరోగా తెలుగులో ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందుకున్న మాస్ రాజా.. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌కు వెళ్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా బహు భాషల్లో రిలీజవుతోంది. హిందీలోనూ ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లాంచ్ కూడా ముంబయిలోనే చేయడం విశేషం.

ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు రవితేజ. ఈ సందర్భంగా బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ మన మాస్ రాజా గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలుగులో పెద్ద విజయం సాధించిన రవితేజ సినిమాలు విక్రమార్కుడు, కిక్.. హిందీలో ‘కిక్’, ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.

హిందీ ప్రేక్షకుల్లో చాలామందికి ఆ సినిమాల ఒరిజినల్ హీరో రవితేజ అని తెలియదు. ఈ విషయాన్ని మీడియా వాళ్ల ద్వారా జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేశాడు అనుపమ్. కిక్, రౌడీ రాథోడ్ సినిమాల ఒరిజినల్ హీరో ఇతనే, ఈ విషయం అందరికీ తెలియాలి అని ఆయన పేర్కొన్నాడు. అంతే కాక 80వ దశకంలో రవితేజ తనతో ఫొటో కావాలని అడిగాడని, కానీ తాను అందుకు నిరాకరించానని.. కానీ ఇప్పుడు అదే వ్యక్తి హీరోగా నటించిన చిత్రంలో తాను ఒక కీలక పాత్ర చేశానని.. ఇది తన ఎదుగుదలకు నిదర్శనమని ఆయన కొనియాడాడు. మాస్ రాజాకు ఇంతకంటే మంచి ఎలివేషన్ ఏముంటుంది?