రాజాసాబ్ తర్వాత మారుతి తొలిసారి.. నెగిటివిటీపై ఏమన్నారంటే?
టాలీవుడ్ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మారుతి.
By: M Prashanth | 23 April 2026 11:19 AM ISTటాలీవుడ్ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మారుతి. భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలపై ఆధారపడకుండా కథకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడిగా మంచి పేరు ఉంది. వరుస విజయాలతో ముందుకెళ్లిన మారుతి.. ఇటీవల మాత్రం ఊహించని ఎదురుదెబ్బ ఎదుర్కొన్నారని చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ది రాజాసాబ్ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ హారర్ కామెడీ జానర్ లో రూపొందిన ఆ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, కలెక్షన్లు పడిపోయి డిజాస్టర్ గా మారింది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో మారుతిపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద స్టార్ నమ్మి అవకాశం ఇస్తే ఇలాంటి సినిమా తీస్తావా? అంటూ ట్రోలింగ్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో మారుతి కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. బయట కూడా కనిపించకపోవడం గమనార్హం. కొన్ని నెలల తర్వాత తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న మారుతి, నెగెటివిటీపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
"ప్రతిరోజూ మన చుట్టూ నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ వ్యక్తులు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని పాజిటివ్ గా చూడటం, ఆ దిశగా ఆలోచించడం, ఆచరించడం చాలా కష్టమైన విషయం" అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి రాజాసాబ్ తో మారుతి టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరతారని అంతా భావించారు. అప్పటి వరకు చిన్న, మీడియం హీరోలతో సినిమాలు చేసిన ఆయనకు ప్రభాస్ తో పని చేసే అవకాశం రావడం పెద్ద బ్రేక్ గా భావించారు. కానీ సినిమా ఫలితం ఆశించిన విధంగా లేకపోవడంతో నెగిటివిటీ పెరిగింది.
అదే సమయంలో మారుతి.. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పోస్ట్ షేర్ చేశారు. ప్రతి ప్రయాణం ఒక పాఠం అంటూ ప్రారంభించిన ఆయన, తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పై పని చేస్తున్నట్లు వెల్లడించారు. దేవుడి ఆశీస్సులతో స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నానని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
మారుతి షేర్ చేసిన ఫోటోలో ఆయన తన కొత్త సినిమా స్క్రిప్ట్ ను దేవుడి ముందు ఉంచి పూజ చేసినట్టు కనిపించింది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై చర్చ మొదలైంది. త్వరలో ఆ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ తో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
