Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ అలా అన్న‌ప్పుడు మారుతి భ‌య‌ప‌డ్డాడ‌ట‌

ఈ మూవీ టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 4:14 PM IST
ప్ర‌భాస్ అలా అన్న‌ప్పుడు మారుతి భ‌య‌ప‌డ్డాడ‌ట‌
X

ప్ర‌భాస్ ఓ పాన్ ఇండియా స్టార్‌. త‌న‌తో సినిమాలు చేయాల‌ని క్రేజీ డైరెక్ట‌ర్స్‌, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయ‌న ఓకే అంటే వెంట‌నే పాన్ వ‌రల్డ్ సినిమాకైనా రెడీ అనే వారున్నారు. అయితే ప్ర‌భాస్‌కు మాత్రం మారుతితో సినిమా చేయాల‌ని ఉంద‌ట‌. ఆ కార‌ణంగానే మారుతి డైరెక్ష‌న్‌లో 'ది రాజా సాబ్‌'కు శ్రీ‌కారం చుట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై ఈ ప్రాజెక్ట్‌ని నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించారు.

ది రాజా సాబ్ టెక్నిక‌ల్‌గా ఏ స్థాయిలో తీశామో చెబుతూనే ఆ గ్రాండ్ లుక్ కుదిరింద‌న్నారు. ఈ ప్రాజెక్ట్ అనుకోగానే ప్ర‌భాస్ 'మ‌నం హార‌ర్ కామెడీ చేద్దాం' అన్నారు. ఆ మాట విని నేను భ‌య‌ప‌డ్డాను. హార‌ర్ కామెడీ ఏంటీ 'ప్రేమ‌క‌థా చిత్రం' చేసిన త‌రువాత ఇదే కాన్సెప్ట్‌తో 500 సినిమాలొచ్చాయి. ప్ర‌తీ వారం ఓ హార‌ర్ కామెడీ సినిమా వ‌చ్చింది. దీన్ని దాటి ఏది తీస్తాం అని భ‌య‌మేసింది. అందులోనూ ప్ర‌భాస్ గారిని తీసుకొచ్చి ఏదో చేయాలి అన్న‌ట్టుగా చేయ‌లేము. అది సాధ్యం కాద‌ని కొంత కంగారు ప‌డ్డాను.

అయితే ఆ ఫార్ములాకు మించిన సినిమా చేయాల‌ని దాన్ని క్రాక్ చేయ‌డం కోస‌మే నేను ఈ సినిమా కోసం ఎక్కు టైమ్ తీసుకున్నాను. అదే ఈ సినిమాకు చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఒక హాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ది రాజా సాబ్ సినిమా అలా ఉంటుంది. అదే స‌మ‌యంలో భీమ‌వ‌రం నుంచి వెళ్లిన ఓ వ్య‌క్తి హాలీవుడ్ రేంజ్‌కి వెళితే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి గ్రాండియ‌ర్ అంతా బాగా కుదిరింది` అని తెలిపారు.

బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్‌ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలో హీరోయిన్‌లుగా మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బోమ‌న్ ఇరానీ, జ‌రీనా వాహెబ్‌, స‌ముద్ర‌ఖ‌ని, బ్ర‌హ్మానందం, యోగిబాబు, వెన్నెల కిషోర్‌, సుప్రీత్‌రెడ్డి న‌టించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీని డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదుభాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.