సినిమా ఆడకపోతే చెప్పుతో కొట్టుకుంటారా? పిచ్చి పనులు చేయొద్దు: మారుతి
ఇప్పుడు ఆ విషయంపై బార్బరిక్ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరించిన డైరెక్టర్ మారుతి స్పందించారు. మారుతి టీమ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న మరో సినిమా బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.
By: Tupaki Desk | 14 Sept 2025 7:00 PM ISTత్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స ఇటీవల చెప్పుతో కొట్టుకుని హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తాను తెరకెక్కించిన చిన్న సినిమాను చూసేందుకు ప్రజలు థియేటర్స్ కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సినిమా అంటున్నా కూడా.. ఎవరూ వచ్చి థియేటర్స్ లో చూడడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
బార్బరిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని చెప్పిన ఆయన.. నిజంగా చెప్పుతో కొట్టుకుని వీడియో రిలీజ్ చేశారు. దీంతో అది వైరల్ గా మారి అనేక మంది స్పందించారు. ఆ తర్వాత ఎవరైనా తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయ్యారా, సారీ అని చెప్పారు. అప్పట్లో ఆ విషయం చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఆ విషయంపై బార్బరిక్ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరించిన డైరెక్టర్ మారుతి స్పందించారు. మారుతి టీమ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న మరో సినిమా బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. తానిప్పుడు రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నానని తెలిపారు. కానీ బ్యూటీ నిర్మాత విజయ్ పాల్ తో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు.
"విజయ్ పాల్ త్రిబాణధారి బార్బరిక్ పేరుతో మంచి సినిమా తీశారు. ఆ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మంచి దర్శకుడే. నేను టైటిల్ మార్చమని వందసార్లు చెప్పా. బార్బరిక్ అంటూ బార్పిక్యూలా ఉందని, ఎవరికీ అర్థం కాదని చెప్పా. నీవు ఆలోచించి వంద టైటిల్స్ పంపా. చెప్తే అర్థం కాదని లోగోస్ రాసి కూడా పంపా" అని మారుతి తెలిపారు.
"పంపించినా సరే ఆయన ఓ ట్రాన్స్ లో ఉన్నాడు. ఆ సినిమా గురించి కథ గురించి బార్బరిక్ టైటిల్ సరిపోతుందని ఫీలయ్యాడు. కానీ మనం వేరు.. ఆడియన్స్ ఫీలవ్వడం వేరు. కానీ డైరెక్టర్ మరో డైరెక్టర్ ను ఫోర్స్ చేయలేనని.. నమ్మారు కదా వెళ్లిపోండని అని చెప్పా.. ఆ టైటిల్ తో సినిమా రిలీజ్ అయింది" అని మారుతి చెప్పుకొచ్చారు.
"చివరకు మంచి సినిమాను తీసి ప్రేక్షకులు చూడటం లేదంటూ ఆయన చెప్పుతో కొట్టుకోవడం చాలా బాధ కలిగించింది. డైరెక్టర్లు, కళాకారులు దయచేసి అలాంటి పిచ్చి చేష్టలు ఎప్పుడు చేయొద్దు. ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు కొందరు బూతులు మాట్లాడుతున్నారు. చొక్కా తీసి తిరుగుతా అంటున్నారు" అని తెలిపారు.
"అయితే ఒక సినిమా ఆడకపోతే ఇంతకు దిగజారుతారా? దారుణంగా మాట్లాడుతారా? ఒకటి కాకపోతే మరొక సినిమా ఆడుతుంది. అంతేగాని సినిమాలు మానేస్తా.. రాను అంటూ బూతులు మాట్లాడుతున్నారు. ఏంటిది? కల్చర్ ఎటు వెళ్తుంది? చాలా సినిమాలకు చూస్తున్నా. ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడితేనే సినిమా వెళ్తుంది అనుకుంటున్నారు.. అది కరెక్ట్ కాదు" అని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
