మెగా హీరోతో మారుతి కామెడీ థ్రిల్లర్?
కెరీర్ ప్రారంభంలో చిన్న బడ్జెట్ ఇనిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్ మారుతి.
By: Ravindar Gorantla | 17 Feb 2026 12:40 PM ISTకెరీర్ ప్రారంభంలో చిన్న బడ్జెట్ ఇనిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్ మారుతి. కేవలం రూ.54 లక్షల బడ్జెట్‌తో `ఈరోజుల్లో` మూవీని రూపొందించి రూ.10 కోట్లకు పైనే వసూళ్లని రాబట్టి అందరిని ఔరా అనిపించాడు. బస్‌స్టాప్, భలే భలే మగాడివోయ్, ప్రేమకథా చిత్రమ్, మహాను భావుడు వంటి సినిమాలతో వండర్స్ క్రియేట్ చేశాడు. ఇందులో నానితో రూపొందించిన `భలే భలే మగాడివోయ్` పది కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మిస్తే ఊహించిన స్థాయిలో లాభాల్ని తెచ్చి పెట్టింది. కేవలం రెండే రెండు కోట్లతో తీసిన `ప్రేమ కథా చిత్రమ్` ఏకంగా రూ.20 కోట్లు తెచ్చి పెట్టింది.
చిన్న సినిమాలతో భారీ లాభాల్ని అందించి దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకున్నాడు. చిన్న బడ్జెట్ సినిమాలతో అద్భుతాలు సృష్టించిన మారుతి పెద్ద స్టార్‌ల కోసం పరుగెత్తే క్రమంలో దెబ్బలు తినడం మొదలు పెట్టాడు. విక్టరీ వెంకటేష్‌తో `బాబు బంగారం`, అక్కినేని నాగచైతన్యతో చేసిన `శైలజారెడ్డి అల్లుడు`, మ్యాచో మ్యాన్ గోపీచంద్‌తో చేసిన `పక్కా కమర్షియల్` వంటి సినిమాలు ఇందుకు బిగ్ ఎగ్జాంపుల్‌గా నిలిచాయి. నాలుగేళ్లు టైమ్ తీసుకుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేసిన కామెడీ హారర్ థ్రిల్లర్ `రాజాసాబ్` కూడా ఇదే ఫలితాన్ని అందించి షాక్ ఇచ్చింది.
అనుకున్న కథని అనుకున్న విధంగా తెరపైకి తీసుకెళ్లి ఉంటే మరో `ప్రేమకథా చిత్రమ్` తరహాలో `ది రాజాసాబ్` బ్లాక్ బస్టర్ అనిపించుకునేది. కానీ అది జరగకపోవడం వల్లే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచి డైరెక్టర్‌గా మారుతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో మళ్లీ మారుతి తన పాత స్కూల్ స్టైల్లోనే కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `ది రాజాసాబ్` తరువాత మారుతి మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడని వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తానని మారుతి ఇటీవల వెల్లడించారు. కానీ మెగా హీరోతో మాత్రం ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించలేదు. అయినా సరే మారుతి ప్రాజెక్ట్‌పై వార్తలు ఆగడంలేదు జోరుగానే వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ మూవీని మెగాహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో చేయబోతున్నాడని, ఇప్పటికే తనని ఫైనల్ చేసుకున్నాడని, ఈ మూవీని మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ సారి కూడా మారుతి కామెడీ థ్రిల్లర్ స్టోరీనే ఈ మూవీకి ఎంచుకున్నాడట.ఈమూవీతో మళ్లీ మ్యాజిక్ చేసి ట్రాక్‌లోకి వచ్చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
