మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని సమ్మర్ క్యాంప్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 April 2025 5:23 PMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని సమ్మర్ క్యాంప్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఏడేళ్ల చిన్నారికి జరిగిన ఈ ప్రమాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
అయితే అభిమానులందరికీ ఊరటనిస్తూ, మార్క్ శంకర్ ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు. వైద్యుల సహకారంతో ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. ఈ శుభవార్తను స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చిరంజీవి ట్వీట్ చేస్తూ.. "మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది. మా కులదైవమైన ఆంజనేయ స్వామి కృపతో, త్వరలోనే అతను పూర్తి ఆరోగ్యంతో, ఎప్పటిలాగానే ఉంటాడు. రేపు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ఆ స్వామి మా కుటుంబాన్ని అతి పెద్ద విపత్తు నుండి రక్షించి ఈ పసి బిడ్డకు పునర్జన్మనిచ్చాడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆయా ఊర్లల్లో, గ్రామాల్లో మా బిడ్డ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్క అభిమానికీ నా తరపున, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు మా బిడ్డలపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి." చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నాడనే వార్త ఒకవైపు అభిమానులకు సంతోషాన్నిస్తే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను చూడటం మరోవైపు వారికి మరింత ఆనందాన్నిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన సాధారణ రూపానికి తిరిగి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే సినిమా షూటింగ్‌లలో పాల్గొంటారని కామెంట్లు పెడుతున్నారు.
వాస్తవానికి, పవన్ కళ్యాణ్ ఈ వారంలోనే 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. డేట్స్ కూడా కేటాయించారు. కానీ ఈ సంఘటన కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం మే 9న విడుదల అవుతుందో లేదో అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, వచ్చే వారంలో ఆయన నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొని, డబ్బింగ్ కూడా పూర్తి చేయనున్నారని సమాచారం. రేపటి నుండి ఈ చిత్రం గురించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.