Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌ క్యాన్సల్‌

ఈమధ్య కాలంలో సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రాంచైజీ సినిమాల ట్రెండ్‌ నడుస్తున్న ఈ సమయంలో ఒక మలయాళ సూపర్‌ హిట్ మూవీకి సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు.

By:  Tupaki Desk   |   15 Jun 2025 5:49 AM
సూపర్‌  హిట్‌ మూవీ సీక్వెల్‌ క్యాన్సల్‌
X

ఈమధ్య కాలంలో సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రాంచైజీ సినిమాల ట్రెండ్‌ నడుస్తున్న ఈ సమయంలో ఒక మలయాళ సూపర్‌ హిట్ మూవీకి సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో సీక్వెల్‌ కచ్చితంగా చేయాలని మేకర్స్ భావించారు, ఫ్యాన్స్ కూడా సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే 'మార్కో'. మలయాళంలో వచ్చిన మార్కో సినిమాలో ఉన్ని ముకుందన్‌ హీరోగా నటించగా కీలక పాత్రల్లో సిద్దిక్‌, జగదీష్‌, అభిమన్యు ఎస్‌ తిలకన్‌, కబీర్ దుహాన్‌ సింగ్‌, యుక్తి తారేజాలు నటించారు. హనీఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి స్పందన వచ్చింది.

మలయాళంలో ఇప్పటి వరకు వచ్చిన 'ఏ' రేటెడ్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మార్కో నిలిచిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన మార్కో సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.110 కోట్లు రాబట్టిందని మలయాళ బాక్సాఫీస్ వర్గాల వారు పేర్కొన్నారు. ఇంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న మార్కో సినిమాకు సీక్వెల్‌ చేసే యోచనలో ఉన్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. దాంతో అప్పటి నుంచి ఉన్ని ముకుందన్‌ అభిమానులు సీక్వెల్‌ అప్‌డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పదే పదే మార్కో సీక్వెల్‌ ఎప్పుడు అంటూ ఏకంగా ఉన్ని ముకుందన్‌ ను ప్రశ్నిస్తూ కామెంట్‌లు చేయడంతో పాటు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని పెట్టిన కామెంట్‌కు ఉన్ని ముకుందన్‌ క్లారిటీ ఇచ్చాడు. మార్కో సీక్వెల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. అంతే కాకుండా అభిమానుల ఎదురు చూపులకు తెర దించాడు. మార్కో 2 ఎప్పుడు వస్తుంది అన్నా అంటూ ఒక అభిమాని ప్రశ్నించిన సమయంలో ఉన్ని ముకుందన్‌ స్పందించాడు. మార్కో సినిమా సీక్వెల్‌ ఆలోచన విరమించుకున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌ చేయలేమని చెప్పాడు. అంతే కాకుండా మార్కో సినిమాను మించిన బెస్ట్‌ సినిమాను తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఆ సినిమాకు వచ్చిన తీవ్రమైన నెగిటివిటీ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నాడు. సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చినా కూడా హింసాత్మక సన్నివేశాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే హింసాత్మక సన్నివేశాల స్థాయిని తగ్గించి మార్కో 2 ను తీయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న వేళ స్వయంగా ఉన్ని ముకుందన్‌ ప్రకటన చేయడంతో ఇక సీక్వెల్‌ కోసం ఎదురు చూపులకు తెర పడినట్లు అయింది. ఉన్ని ముకుందన్‌ నుంచి కొత్తదైన మంచి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.