Begin typing your search above and press return to search.

సూపర్ హిట్‌ మూవీ సీక్వెల్‌ ప్రకటన వచ్చేసిందోచ్‌

పార్ట్ 2 లోడింగ్‌.. అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అన్నట్లుగా దర్శకుడు ట్వీట్ చేశాడు.

By:  Tupaki Desk   |   27 July 2023 6:15 AM GMT
సూపర్ హిట్‌ మూవీ సీక్వెల్‌ ప్రకటన వచ్చేసిందోచ్‌
X

తమిళ్‌ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న హీరో ఆది పినిశెట్టి. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు విలన్‌ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఈ హీరో సూపర్‌ హిట్ చిత్రాల్లో మరకథమణి సినిమా ఒకటి. తమిళ్ లో మరగధ నానయం అనే టైటిల్‌ తో వచ్చిన ఈ సినిమా అక్కడ ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆర్క్‌ శరవణ్‌ దర్శకత్వంలో వచ్చిన మరకథమణి సినిమా లో ఆది పినిశెట్టికి జోడీగా నిక్కీ గల్రానీ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. 2017 సంవత్సరంలో వచ్చిన మరకథమణి సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రాబోతుంది.

ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ ఈ సీక్వెల్‌ లో నటించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఈ సినిమా సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా వర్గాల్లో ఈ సీక్వెల్‌ గురించి జరుగుతున్న ప్రచారం నిజం అన్నట్లుగా దర్శకుడు ఆర్క్‌ శరవణ్‌ సీక్వెల్‌ యొక్క అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేయడం జరిగింది.

పార్ట్ 2 లోడింగ్‌.. అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అన్నట్లుగా దర్శకుడు ట్వీట్ చేశాడు. దాంతో ఆది పినిశెట్టి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సీక్వెల్‌ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెళ్లడిస్తామని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

మరకథమణి తో పోల్చితే సీక్వెల్‌ లో అంతకు మించిన ట్విస్ట్‌ లు ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లుగా తమిళ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌ ప్రకటన అధికారికంగా రావడంతో ఇక సినిమా మొదలు అయ్యేది ఎప్పుడు.. విడుదల అయ్యేది ఎప్పుడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.