అక్కడ గెలిచిన మానుషి ఇక్కడ ఓటమి
ఇండియన్ ముద్దుగుమ్మలు అంతా కోరుకునే అందాల తార కిరీటంను హర్యానా రాష్ట్రంకు చెందిన మానుషి చిల్లర్ 2017లో దక్కించుకుంది.
By: Tupaki Desk | 4 July 2025 12:03 PM ISTఇండియన్ ముద్దుగుమ్మలు అంతా కోరుకునే అందాల తార కిరీటంను హర్యానా రాష్ట్రంకు చెందిన మానుషి చిల్లర్ 2017లో దక్కించుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీల్లో హర్యానా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించిన మానుషి చిల్లర్ అదే ఏడాది మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది. ఇండియాకు 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించిన ముద్దుగుమ్మగా మానుషి చిల్లర్ నిలిచింది. ఈ అరుదైన గౌరవం, అందాల కిరీటం దక్కించుకున్న ఆరవ భారతీయురాలుగా మానుషి చరిత్రలో నిలిచింది. సాధారణంగా అందాల పోటీల్లో విజయం సాధించిన వారు ఎక్కువగా సినిమాల్లో అడుగు పెడుతూ ఉంటారు, చాలా మంది అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
మానుషి సైతం బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అందాల కిరీటం వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మానుషి చిల్లర్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ అనే పౌరాణిక సినిమాలో మానుషి నటించింది. తక్కువ సమయంలోనే మానుషికి హీరోయిన్‌గా మంచి గుర్తింపు లభించింది. మానుషి హీరోయిన్‌గా మొదటి ప్రయత్నం విఫలం అయింది. మానుషి చిల్లర్ మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్లీ ఆఫర్లు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ మానుషి చిల్లర్‌కి అదృష్టం కలిసి వచ్చింది. ఆ వెంటనే ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా సైతం ఈమెకు ఆశించిన స్థాయిలో హిట్ తెచ్చి పెట్టలేదు.
వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో మానుషి చిల్లర్ కెరీర్ సందిగ్ధంలో పడ్డట్లు అయింది. ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తెలుగు నుంచి ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. వరుణ్ తేజ్‌కి జోడీగా ఆ సినిమాలో మానుషి నటించింది. ఆ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఆ సినిమా అక్కడ, ఇక్కడ రెండు చోట్ల నిరాశ పరిచింది. గత ఏడాదిలోనే బడే మియాన్ చోటే మియాన్ సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటించింది. ఆ సినిమా సైతం మానుషికి నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు 'మాలిక్' సినిమాపై సర్వం ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది.
పుల్కిత్ దర్శకత్వంలో రూపొందిన మాలిక్ మూవీ జులై 11, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజ్ కుమార్ రావు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో మానుషి చిల్లర్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. అంతే కాకుండా స్కిన్ షో తోనూ మెప్పించబోతుంది. వెండి తెరపై స్కిన్ షో తో ఈసారి గతం కంటే ఎక్కువ అన్నట్లుగా అలరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై మానుషి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్‌లో మానుషి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఫలితం తారుమారు అయితే మానుషి ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిందే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
