ఆయన్ని తలచుకోని రోజు ఉండదు
తెలుగులో మనోజ్ బాజ్‌పేయి తక్కువ సినిమాల్లోనే నటించినా తన నటనతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.
By: Tupaki Desk | 26 April 2025 2:45 AMమనోజ్ బాజ్‌పేయి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో సుపరిచితమైన పేరు. ఈ బాలీవుడ్ నటుడు 1994లో సినిమా రంగంలో అడుగుపెట్టగా, 1999లో ప్రేమకథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యాడు. ఆతర్వాత హ్యాపీ, వేదం, కొమరం పులి వంటి పలు చిత్రాలతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో తన నటనతో తెలుగు సినీ అభిమానులను అలరించాడు. తెలుగులో మనోజ్ బాజ్‌పేయి తక్కువ సినిమాల్లోనే నటించినా తన నటనతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.
బిహార్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన మనోజ్ తన నటనా కౌశల్యంతో 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా సాధించాడు. కెరీర్‌లో ఎన్నో మైలురాయిలను సాధించిన మనోజ్ తన సినీ జీవితం ప్రారంభంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
నటుడిగా బండిట్ క్వీన్ తన తొలి చిత్రమైనా, 1998లో ఆర్జీవీ దర్శకత్వంలో నటించిన సత్య సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పాడు. ఈ సినిమా అనంతరం ఆర్జీవీ డైరెక్షన్‌లో రెండు సినిమాల్లో నటించానని , ఒక చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించానని తెలిపాడు. ఆర్జీవీ ఇచ్చిన ఈ అవకాశాలతో తన కెరీర్ ఎదుగుదలకు తొడ్పడ్డాయని వివరించాడు. ఆ దశలో కెరీర్‌లో తాను నిలదొక్కుకోవడానికి ఆర్జీవీ ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఎప్పటికి మర్చిపోలేనని ప్రతి రోజూ తనను గుర్తు చేసుకుంటానని అతడికి కృతజ్ఞతలు తెలిపాడు.
సినీ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగడం ఆషామాషీ కాదు, మన ముందు నవ్వుతూనే మాట్లాడతారు, వెనకాల హేళన చేస్తూ ఉంటారని చెప్పాడు. చిత్ర పరిశ్రమలో తీవ్రమైన పోటీ ఉంటుందని, ఇవన్నీ తట్టుకొని ఈ స్థాయికి వచ్చానని తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో దిగాలు పడ్డానని, కోపం కూడా వచ్చేదని చెప్పాడు. తర్వాత అవన్నీ నిదానంగా అలవాటు చేసుకున్నానని చెప్పాడు. సినిమా రంగమే ప్రపంచం అనుకొని వచ్చానని, ఎన్నో సవాళ్లను తట్టుకొని నిలబడ్డానని, తనకు సినిమాలు తప్ప వేరే లోకం తెలియదని తెలిపాడు.