Begin typing your search above and press return to search.

అందరి కళ్ళూ 'మంజుమ్మెల్ బాయ్స్' పైనే!

తమిళనాడులోనూ 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన డబ్బింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   5 April 2024 9:09 AM GMT
అందరి కళ్ళూ మంజుమ్మెల్ బాయ్స్ పైనే!
X

మ‌ల‌యాళంలో కనీవినీ ఎరుగని విజయం సాధించి, రికార్డుల మీద రికార్డులు తిర‌గ రాస్తున్న‌చిత్రం ''మంజుమ్మెల్ బాయ్స్''. ఇది బాక్సాఫీస్ వద్ద రూ. 225 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ స్టార్‌ హీరో చిత్రానికి సాధ్యపడని రీతిలో వ‌సూళ్లను రాబ‌డుతూ మాలీవుడ్ ను షేక్ చేస్తోంది. తమిళనాడులోనూ 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన డబ్బింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా రేపు ఏప్రిల్ 6న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. డబ్బింగ్ మూవీ అనుకోకుండా, దీన్ని స్ట్రెయిట్ సినిమా మాదిరిగానే దాదాపు 300 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. ఈరోజు శుక్రవారమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. ఓవర్ సీస్ లో ఈ చిత్రాన్ని నిర్వణ సినిమాస్ రిలీజ్ చేస్తోంది.

ఇప్పటికే రిలీజైన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ తెలుగు ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్బింగ్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా అనువాద చిత్రం అనే ఫీలింగ్ కలగకుండా, ప్రాపర్ ఒరిజినల్ సినిమా అనిపించేలా డబ్బింగ్ చేసారు. ఇప్పుడు సినీ అభిమానులంతా ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మలయాళ చిత్ర బృందం హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్స్ చేయడం ఇక్కడి జనాలను ఆకర్షించింది. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి.

గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన స్ఫూర్తితో 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాని తెరకెక్కించారు. కేర‌ళ‌లోని ఎర్నాకులం మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొంతమంది స్నేహితుల బృందం, తమిళనాడులోని కొడైకెనాల్ కు టూర్‌కు వెళ్తారు. అక్కడ క‌మ‌ల్‌ హ‌స‌న్ న‌టించిన 'గుణ' సినిమా షూటింగ్ జ‌రిగిన నిషేధిత ప్రాంతమైన గుహలను చూడటానికి వెళ్తారు. అయితే ప్రమాదవశాత్తూ వారిలో ఒకరు ఆ గుహాలో ప‌డిపోతాడు. అతన్ని బ‌య‌ట‌కి తీసుకురావ‌డానికి మిగిలిన ఫ్రెండ్స్ ఎలాంటి సాహసాలు చేసారు? ఈ క్రమంలో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? చివరకు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు? అనేదే ఈ సినిమా కథాంశం.

కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లింగ్.. ఇలా అన్ని ర‌కాల భావోద్వేగాల‌తో, ప్రేక్ష‌కుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టే సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మెల్ బాయ్స్'. ఇది ఫ్రెండ్ షిప్ గురించి, ఒకటిగా కలిసి ఉండటం గురించి తెలియజేస్తుంది. ఎక్కడా సినిమా చూస్తున్నామనే భావన కలగకుండా, నిజంగా మన కళ్ళ ముందు జరుగుతోందనే భావన కలిగించేలా ఉండటం ఈ మూవీ ప్రత్యేకత. దీని కోసం దాదాపు సినిమా అంతా రియల్ లొకేషన్ లోనే సూట్ చేసారు. కేవ్స్ లోపల సీన్స్ ని మాత్రం సెట్స్ లో చిత్రీకరించారు. 'గుణ' సినిమాలోని 'క‌మ్మ‌నీ ఈ ప్రేమ‌' వంటి క్లాసిక్ సాంగ్ ను ఉపయోగించిన విధానం ఆకట్టుకుంటుంది. కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి ఎందరో సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి, చిత్ర బృందాన్ని అభినందించారు.

'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రానికి చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వం వహించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. ఇందులో సౌబిన్ షాహిర్, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్, దీపక్, అర్జున్ కురియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా వ్యవహరించారు.

మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కంటెంట్ నచ్చితే చాలు అది ఎలాంటి సినిమా అయినా నెత్తిన పెట్టుకుంటారు. గతంలో అనేక డబ్బింగ్ సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడుతుంటారు. అదే కోవలో ఇప్పుడు రాబోతున్న సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మెల్ బాయ్స్'. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.