Begin typing your search above and press return to search.

ఇటు లవ్ & ఫ్యామిలీ.. అటు ఫ్రెండ్ షిప్ & థ్రిల్స్!

ఇటీవల కాలంలో మాలీవుడ్ నుంచి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వాటిల్లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'భ్రమయుగం' ఒకటి

By:  Tupaki Desk   |   3 April 2024 7:09 PM GMT
ఇటు లవ్ & ఫ్యామిలీ.. అటు ఫ్రెండ్ షిప్ & థ్రిల్స్!
X

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు మలయాళ చిత్ర పరిశ్రమ. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు రూపొందించి, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లు అందుకుంటున్నారు. సరికొత్త కథలను, ఎవరూ టచ్ చేయని వైవిధ్యమైన అంశాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. కోవిడ్ పాండమిక్ టైంలో ఓటీటీల పుణ్యమా అని మలయాళ చిత్రాలు మన ప్రేక్షకులకు కూడా బాగా రీచ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అక్కడ సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరిచారు. రీమేక్స్ కు ఆదరణ తగ్గడంతో, ఇప్పుడు మలయాళ సినిమాల రైట్స్ తీసుకొని, నేరుగా తెలుగులోకి డబ్బింగ్ చేసి మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ, ఈ అనువాద చిత్రాలు అప్పుడప్పుడు తెలుగు సినిమాలను దెబ్బేస్తున్నాయి.

ఇటీవల కాలంలో మాలీవుడ్ నుంచి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వాటిల్లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'భ్రమయుగం' ఒకటి. పూర్తి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కేవలం రూ. 27 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద రూ. 85 కోట్ల వరకూ రాబట్టింది. అలాంటి చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తే, ఓ మోస్త‌రుగా ఆడింది. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమ‌లు' చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్ష‌కులకు అందించారు. ఎస్. ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసిన ఈ సినిమా, ఇక్కడ కూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన 'ప్రేమలు' సినిమా బాక్సాఫీస్ వద్ద 135 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మలయాళంలో రిలీజైన నెల రోజుల తర్వాత, మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసారు. 'గామి', 'భీమా' లాంటి క్రేజీ చిత్రాలు పోటీలో ఉన్నా సరే వాటికి ధీటుగా నిలబడింది. యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ డబ్బింగ్ సినిమా.. ఎ సెంటర్స్, మల్టీఫ్లెక్స్ లలో బాగా ఆడింది. ఇది రెండు తెలుగు సినిమా వసూళ్లపై కొంత వరకూ ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మలయాళ డబ్బింగ్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు వస్తోంది.

మాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ''మంజుమ్మల్ బాయ్స్''. సుమారు 20 తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ. 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక తమిళనాడులో ఈ సినిమా 63 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే వారంలో 'ఫ్యామిలీ స్టార్' లాంటి క్రేజీ తెలుగు సినిమా థియేటర్లలోకి రానుంది.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''ఫ్యామిలీ స్టార్''. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీనికి పోటీగా మరుసటి రోజు 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఒక రోజు ముందుగానే, అంటే ఏప్రిల్ 5వ తేదీన స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. డబ్బింగ్ సినిమా కదా దీన్ని లైట్ తీసుకోలేం. ఎందుకంటే కంటెంట్ నచ్చితే చాలు, మనోళ్లు ఏ భాష అనేది పట్టించుకోకుండా నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటికే 'ప్రేమలు' విషయంలో ఇది మరోసారి ప్రూవ్ అయింది. అందులోనూ మైత్రీ మేకర్స్ సపోర్ట్ ఉంది. అందుకే ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ కారణంగా ఫ్యామిలీ స్టార్ వసూళ్లకు గండి పడుతుందేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఇక్కడ 'ఫ్యామిలీ స్టార్' ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. ఎలాగూ దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఉండనే ఉన్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఇంటిల్లపాదీ కలిసి చూసే మంచి ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా రోజులయ్యింది. దీంట్లో యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీ మేజర్ గా ఉంటుందని మేకర్స్ చెబుతూనే ఉన్నారు. సమ్మర్ సీజన్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. మరి వేటికవే ప్రత్యేకంగా రాబోతున్న ఈ రెండు సినిమాలలో ఏది ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.