Begin typing your search above and press return to search.

మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ట్రైలర్.. ఎలా ఉందంటే..

మలయాళం సినిమాలు.. వీటికి ఉన్న క్రేజే వేరు. ఇటీవల కాలంలో అన్ని ఇండస్ట్రీల వాళ్లు మాలీవుడ్ మూవీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 1:18 PM GMT
మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ట్రైలర్.. ఎలా ఉందంటే..
X

మలయాళం సినిమాలు.. వీటికి ఉన్న క్రేజే వేరు. ఇటీవల కాలంలో అన్ని ఇండస్ట్రీల వాళ్లు మాలీవుడ్ మూవీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ లో కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. భ్రమయుగం, ప్రేమలు చిత్రాల తెలుగు వెర్షన్లు ఇటీవల విడుదలై ఆకట్టుకున్నాయి. ప్రేమలు మూవీ ఏకంగా తెలుగులో రూ.15 కోట్లు వసూలు చేసింది.


ఇప్పుడు మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ థియేటర్ లో క్లిక్ అవుతుందని నిర్మాతలు.నమ్మకంతో ఉన్నారు.

తాజాగా మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మంచి ప్రకృతి అందాలతో ట్రైలర్ మొదలైంది. లీడ్ రోల్స్ లో నటించిన యాక్టర్లు.. చిన్నప్పుడు ఆడుకుంటున్నట్లు చూపించారు. ఆ తర్వాత కొడైకెనాల్ టూర్ ఫిక్స్ అయిందని తెలిసి హ్యాపీ ఫీలవుతారు. ఇక ట్రిప్ కు వెళ్లాక ఓ స్నేహితుడు సొరంగంలో పడిపోయిన తర్వాత అరుస్తున్నట్లు చూపించారు. తమ స్నేహితుడిని వదిలి వెళ్లలేక అక్కడే ఉండి కాపాడుకోవాలని మిగతా ఫ్రెండ్స్ నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా.

ఇప్పటికే తెలుగు ఆడియన్స్ లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ట్రైలర్ చూశాక ఆసక్తి మరింత పెరగడం పక్కా అని చెప్పవచ్చు. విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతోంది. నటులు కూడా తమ నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ట్రైలర్ కట్ కూడా బాగుంది. మరి తెలుగు ప్రేక్షకులను మంజుమ్మల్ బాయ్స్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒరిజినల్ మలయాళం వెర్షన్.. ఫిబ్రవరి 22వ తేదీన విడుదలైంది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మాలీవుడ్ లో ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. కేరళ తో పాటు తమిళనాడులో కూడా ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక తెలుగులో ఎలాంటి రికార్డులు సృష్టించనుందో మరి.