సిరివెన్నెలతో మణిరత్నం అనుబంధం!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు లెజెండరీ రచయిత వేటూరి సుందరామమూర్తి పాటలు రాసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Jun 2025 12:30 PMకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు లెజెండరీ రచయిత వేటూరి సుందరామమూర్తి పాటలు రాసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి కాంబోలో ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి. వాటికి రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ తో శ్రోతల్ని మరో లోకంలోకి తీసుకెళ్లేవారు. మళ్లీ అలాంటి మ్యూజిక్..సాహిత్యం కావాలనుకున్నా? అది అసాద్యమే అవుతుంది. కొన్ని కాంబినేషన్లలో మాత్రమే ఆ మ్యాజిక్ సాధ్యమవుతుంది.
వేటూరి తర్వాత మణిరత్నం పనిచేసింది సిరివెన్నెల సితారామ శాస్త్రీతోనే. వీరిద్దరి కాంబినేషన్ లోనూ ఎన్నో సినిమాలొచ్చాయి. తాజాగా సిరివెన్నెలతో మణిరత్నం అనుబంధాన్ని పంచుకున్నారు. 'సిరి వెన్నెల గారు తక్కువ సమయంలోనే అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆయన్ని చెన్నైకి కిడ్నాప్' చేసి సంగీతం తప్ప మరో ప్రపంచం తెలియని ఓ ఇంట్లో ఉంచేవాళ్లం . వేటూరి సుందర రామ్మూర్తి గారు తర్వాత నా సినిమాలకు ఎక్కువగా సిరివెన్నలే పనిచేసారు.
వేటూరి స్థానాన్ని సిరివెన్నెల భర్తీ చేసారు. ఇద్దరితోనూ అంతే ఆత్మీయంగా, సౌకర్యంగా ఉండేదన్నారు. పాటల సందర్భమే కాకుండా పాత్రల స్వభావాలను కూడా ఎంతో క్షుణ్ణంగా అర్దం చేసుకుని సిరివెన్నెల సాహిత్య అందించేవారు. అందుకే ఆయనకు నా సినిమా కథ పూర్తిగా చెప్పేవాడిని. దానికి తగ్గట్టు పాటలు కథలో భాగమయ్యేవి. పాట అంటే ప్రాణం పెట్టి రాసేవారు. పొన్నియన్ సెల్వన్ సినిమా పాటలకు మీరే రాయాలని కోరాను.
పీరియాడిక్ సినిమా కావడంతో ఆ కాలపు భాషపై పరిశోధన చేసి చెబుతానన్నారు. ట్యూన్స్ సిద్దమయ్యాక కాల్ చేసాను. అప్పుడు కొన్ని వారాల సమయం కావాలన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో లేకుండాపోయారని' వాపోయారు.