వాటి కోసం సినిమాలు చేయను
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్. వీరిద్దరి కాంబినేషన్ లో మూడు దశాబ్దాల ముందు నాయకన్ అనే సినిమా వచ్చింది.
By: Tupaki Desk | 24 May 2025 8:33 PM ISTలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్. వీరిద్దరి కాంబినేషన్ లో మూడు దశాబ్దాల ముందు నాయకన్ అనే సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ థగ్ లైఫ్ కోసం కలిశారు. థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. కమల్ హాసన్ తో కలిసి చాలా ఏళ్ల తర్వాత వర్క్ చేయడం ఆనందంగా ఉందని మణి అన్నారు. ఈ సందర్భంగా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి మణిరత్నంకు ఓ ప్రశ్న ఎదురైంది. సౌత్ లో మరీ ముఖ్యంగా కోలీవుడ్ లో రజినీకాంత్, కమల్‌హాసన్, మణిరత్నం లాంటి వాళ్లున్నప్పటికీ ఎందుకు అక్కడి సినిమాలు రూ.1000 కోట్లు కలెక్ట్ చేయడం లేదని మణిరత్నంను ప్రశ్నించారు.
దానికి మణిరత్నం తనదైన రీతిలో సమాధానమిచ్చారు. భారీ కలెక్షన్స్ తెచ్చే సినిమాలు ముఖ్యమా లేదా ఎక్కువ మంది ఆడియన్స్ హృదయాల్ని హత్తుకునే సినిమాలు చేయడం ముఖ్యమా అనేది మనమంతా ఆలోచించాలని, ఒకప్పటి సినిమాలు ఆడియన్స్ ను ఆద్యంతం ఆకట్టుకునేవని, కానీ ఇప్పుడు సినిమాలోని కొన్ని సీన్స్ మాత్రమే ఆడియన్స్ కు నచ్చుతున్నాయన్నారు.
అంతేకాదు అప్పట్లో ఓ సినిమా వచ్చిందంటే అందులో కంటెంట్ ఏంటి? దాన్ని ఎలా తీశారనే దానిపై మాట్లాడేవారు కానీ ఇప్పుడంతా మారిపోయిందని, ప్రతీదీ బిజినెస్ యాంగిల్ లోనే చూస్తున్నారనీ, ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో సినిమా క్వాలిటీ దెబ్బతింటుదేమో అనిపిస్తుందని, ఎవరేమనుకున్నా తాను మాత్రం బాక్సాఫీస్ నెంబర్ల కోసం సినిమాలు చేయనని, అలా చేయడం కూడా తనకు రాదని మణిరత్నం తెలిపారు.
