Begin typing your search above and press return to search.

మంచు మనోజ్ పొలిటికల్ స్పీచ్.. సపోర్ట్ ఎవరికో?

ప్రస్తుతం దేశంలో ఓ నలుగురు ఒక్క చోట కలిస్తే చాలు.. చర్చంతా రాజకీయాల గురించే. నెట్టింట కూడా అదే ధోరణి

By:  Tupaki Desk   |   20 March 2024 6:11 AM GMT
మంచు మనోజ్ పొలిటికల్ స్పీచ్.. సపోర్ట్ ఎవరికో?
X

ప్రస్తుతం దేశంలో ఓ నలుగురు ఒక్క చోట కలిస్తే చాలు.. చర్చంతా రాజకీయాల గురించే. నెట్టింట కూడా అదే ధోరణి. పార్టీలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్నాయి. సోషల్ మీడియాను కూడా ఆయుధంగా వాడుకుంటున్నాయి. పోస్టర్లు, రీల్స్ షేర్ చేస్తూ ఓటర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాయి.

దేశంలో ప్రస్తుతం ఎక్కడ ఏ వేడుక జరిగినా రాజకీయ వేడి కనిపిస్తోంది! తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో అదే జరిగింది. ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్.. ఎలాంటి పార్టీల పేర్లు చెప్పకుండా రాజకీయ ప్రసంగం చేశారు. నచ్చిన వారు ఓటు వేసుకోండంటూనే ఎవరికి వేయాలో ఎవరికి వేయకూడదో చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మనోజ్ స్పీచ్ ఎన్నికల వేడిని మరింత పెంచింది.

లోకల్ లో ఉన్న వాళ్ల కోసం మీకు బాగా తెలుస్తోంది కాబట్టి పది మంది కలుపుకుని వెళ్లే నాయకుడిని ఎంచుకోండని సూచించారు మంచు మనోజ్. వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్ చేయనివాళ్లు, చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు, తమకేం సహాయం చేస్తారని మంచు హీరో అన్నారు. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకుని కరెక్ట్ గా ఎంపిక చేసుకోండని తెలిపారు.

"మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే మద్దతుగా ఉంటారో వారికే ఓటు వేయండి. ఒకవేళ మీరు కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు నేను చెప్పను. అలా అని ఆ డబ్బులు ఇచ్చారని వారికి ఓటు వేయొద్దు. డబ్బులు ఇస్తే సింపుల్ గా థ్యాంక్యూ బ్రదర్ అని చెప్పేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన వారికి ఓటు వేసుకోండి" అని మంచు మనోజ్ సూచించారు. లవ్ యూ ఆల్.. లవ్ యూ నాన్న.. హ్యాపీ బర్త్ డే.. లవ్ యూ మోహన్ లాల్ సార్ అంటూ ముగించారు.

తిరుపతిలోని ఎంబీయూలో జరిగిన వేడుకల్లో మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌ 32వ వార్షికోత్సవంతో పాటు, మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు అక్కడ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సీనియర్ యాక్టర్లు మోహన్ లాల్, ముకేశ్ రుషీ హాజరయ్యారు. ప్రస్తుతం మనోజ్ స్పీచ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏ పార్టీకి మనోజ్ సపోర్ట్ గా మాట్లాడారోనని తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.