Begin typing your search above and press return to search.

మ‌రో భారీ ప్రాజెక్టుపై క‌న్నేసిన మంచు విష్ణు

ఇప్పుడు తాజాగా ఆ స్క్రిప్ట్ కు మ‌రోసారి జీవం పోసేందుకు విష్ణు ట్రై చేస్తున్నార‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 July 2025 3:15 PM IST
మ‌రో భారీ ప్రాజెక్టుపై క‌న్నేసిన మంచు విష్ణు
X

క‌న్న‌ప్ప సినిమాతో పాన్ ఇండియా న‌టీన‌టులంద‌రినీ ఒక తాటిపైకి తెచ్చారు టాలీవుడ్ న‌టుడు మంచు విష్ణు. క‌న్న‌ప్ప సినిమాను త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పిన విష్ణు ఆ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. క‌న్న‌ప్ప సినిమాతో న‌టుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుని అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న మంచు విష్ణు క‌న్న‌ప్ప కంటే ముందు తాను రామాయ‌ణంను తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిపారు.

క‌న్న‌ప్ప సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయ‌ని విష్ణు ఇప్పుడు త‌న మ‌న‌సంతా రామాయ‌ణంపైనే ఉంద‌ని చెప్పారు. ఆల్రెడీ రామాయ‌ణం స్క్రిప్ట్ త‌న వ‌ద్ద రెడీగా ఉంద‌ని, 2009లోనే త‌మిళ స్టార్ సూర్య‌ను రాముడి పాత్ర‌లో న‌టించ‌మ‌ని చెప్పాన‌ని, కాక‌పోతే బ‌డ్జెట్ కార‌ణంగా ఆ ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అవ‌లేద‌ని చెప్పారు విష్ణు.

ఇప్పుడు తాజాగా ఆ స్క్రిప్ట్ కు మ‌రోసారి జీవం పోసేందుకు విష్ణు ట్రై చేస్తున్నార‌ని తెలుస్తోంది. రావ‌ణుడి పుట్టుక నుంచి చావు వ‌ర‌కు ఏమేం జ‌రిగిందో ఆ క‌థంతా త‌న వ‌ద్ద ఉంద‌ని చెప్పిన విష్ణు ఈ క‌థ‌లో రాముడిగా సూర్య‌, సీతా దేవిగా ఆలియా భ‌ట్, ల‌క్ష్మ‌ణుడిగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, హ‌నుమంతుడిగా తాను, రావణాసురుడిగా త‌న తండ్రి మోహ‌న్ బాబు ను, ఇంద్ర‌జిత్ గా కార్తీ, జ‌టాయుగా స‌త్య‌రాజ్ ను అనుకున్న‌ట్టు తెలిపారు.

విష్ణు మామూలుగా చెప్పిన‌ప్ప‌టికీ ఈ స్టార్ క్యాస్ట్ చూస్తే అంద‌రి మ‌తి పోవ‌డం ఖాయం. క‌న్న‌ప్ప కోసం మోహ‌న్ లాల్, ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్ లాంటి పెద్ద స్టార్ల‌ను తీసుకొచ్చిన విష్ణుకు ఇప్పుడు రామాయ‌ణం కోసం వీళ్ల‌ను తీసుకురావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు కానీ విష్ణు రామాయ‌ణం విష‌యంలో సీరియ‌స్ గా ఉన్నారో లేదోన‌నేది చూడాలి. విష్ణు చెప్పింది విన్న త‌ర్వాత అంతా బానే ఉంది కానీ రాముడి పాత్ర‌లో సూర్య అంటే అత‌ని హైట్, స్క్రీన్ ప్రెజెన్స్ విష‌యంలో ఎలా మేనేజ్ చేస్తార‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆల్రెడీ బాలీవుడ్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్, సాయి ప‌ల్ల‌వి తో డైరెక్ట‌ర్ నితేష్ తివారీ రామాయ‌ణ అనే సినిమాను భారీగా తెరకెక్క‌స్తున్న విష‌యం తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా క‌థ‌ను రెండు భాగాలుగా తెరకెక్కుతుండ‌గా మొద‌టి భాగం 2026 దీపావ‌ళికి, రెండో భాగం 2027 దీపావ‌ళికి రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే.