శివయ్య డైలాగ్స్ ట్రోల్స్‌పై విష్ణు ఏమన్నాడంటే...!
శివ భక్తులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆరాధిస్తారని, అభిమానిస్తారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2025 5:19 AMమంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' సినిమా విడుదలకు సిద్ధం అయింది. జూన్ 27న విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను విష్ణు స్పీడ్ పెంచాడు. గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని విష్ణు గత రెండు మూడు నెలల నుంచి డే అండ్ నైట్ కష్టపడి వర్క్ పూర్తి చేయించాడని తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మంచు విష్ణు తీవ్రంగా నిరాశకు గురి అయ్యాడట. మొదట చేసిన వర్క్ విషయంలో అసంతృప్తి కారణంగానే మరోసారి పూర్తి వర్క్ చేయించాడని, అందుకే సినిమా ఇంత ఆలస్యం అయిందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు.
వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఆలస్యం అయినప్పటికీ విడుదల తర్వాత కచ్చితంగా అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతాయని, శివ భక్తులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆరాధిస్తారని, అభిమానిస్తారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. సినిమా టీజర్ విడుదల అయిన సమయంలో అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా శివుడి పాట విడుదల తర్వాత కూ డా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే టీజర్‌లో విష్ణు చెప్పే శివయ్య అనే డైలాగ్ ట్రోల్స్‌కి గురి అయింది. చాలా మంది సోషల్ మీడియాలో ఆ బిట్‌ను కట్ చేసి రకరకాలుగా వినియోగించారు. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ఒక సినిమాలో కూడా ఆ శివయ్య అనే డైలాగ్‌ను వాడటం వివాదాస్పదం అయింది.
ఆ సినిమా నుంచి శివయ్య అంటూ కమెడియన్ చెప్పే డైలాగ్‌ను తొలగించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో శివయ్య డైలాగ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు కదా.. వాటిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించిన సమయంలో విష్ణు సున్నితంగా స్పందించాడు. ఆ విషయం గురించి పెద్దగా ఆందోళన, ఆగ్రహం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎవరు చేసినా తప్పే అంటూనే ఆ విషయాన్ని గురించి నేను ఎక్కువ సీరియస్‌గా తీసుకోవడం లేదని విష్ణు అన్నాడు.
సినిమా వాళ్లు మా ఇంట్లో వాళ్లే. వారే ఆ డైలాగ్‌ను ఫన్నీగా చూశారు. దేవుడి పేరును కామెడీగా వాడటంను నేను ఎప్పుడూ సహించను. అయితే వారిపై నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకోవడం లేదు. మనల్ని ఏమన్నా అంటే వాళ్ల కర్మ కు వాళ్లు పోతారు. అలాగే దేవుడిని అవహేళన చేసిన వారికి కచ్చితంగా కర్మ చుట్టుకుంటుంది అని నమ్ముతున్నాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇంకా ప్రముఖ నటీ నటులు ముఖ్యమైన గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.