కన్నప్ప రిలీజ్.. మంచు విష్ణు ఆఫీస్ లో GST తనిఖీలు
అయితే జీఎస్టీ అధికారులపై మంచు విష్ణు స్పందించారు. ఓ కార్యక్రమంలో విలేకరులు అడగ్గా, రెస్పాండ్ అయ్యారు.
By: Tupaki Desk | 25 Jun 2025 6:37 PMటాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిన ఆ సినిమా.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో విష్ణు సహా టీమ్ అంతా ఆ వర్క్స్ తో బిజీగా ఉన్నారు.
అదే సమయంలో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు చేసింది. హైదరాబాద్ లోని మాదాపూర్, కావూరి హిల్స్ లో విష్ణుకు చెందిన కార్యాలయాలు ఉండగా.. అక్కడ రెండు బృందాలు బుధవారం తనిఖీలు చేశాయి. ఆయా ఆఫీసుల్లో ఉన్న రికార్డులను పరిశీలించారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు.
కన్నప్ప సినిమాకు సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకే వచ్చి ఇప్పుడు తనిఖీలు చేపడుతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో మంచు మోహన్ బాబు.. విష్ణు ఆఫీస్ కు చేరుకున్నారు.
అయితే జీఎస్టీ అధికారులపై మంచు విష్ణు స్పందించారు. ఓ కార్యక్రమంలో విలేకరులు అడగ్గా, రెస్పాండ్ అయ్యారు. తనకు తనిఖీల విషయం తెలియదన్నారు. మీరు (విలేకరులు) చెప్పేవరకు తెలియదని చెప్పారు. కానీ అక్కడ దాయడానికి ఏం లేదని తెలిపారు. తాము ఎక్కడెక్కడ.. ఎవరెవరి దగ్గర అప్పులు చేశామో తెలుస్తుందని విష్ణు అన్నారు.
ఇక కన్నప్ప మూవీ విషయానికొస్తే.. భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు లీడ్ రోల్ లో నటిస్తూ స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తించారు. రైటర్ గా కూడా వ్యవహరించారు. మంచు మోహన్ బాబు కీలక పాత్రలో యాక్ట్ చేస్తూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
మంచు మూడో తరం ఆరియానా, వివియానా, అవ్రామ్ కన్నప్పలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్రగా సందడి చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా నటించారు. మోహన్‌లాల్, కాజల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, మధుబాల, బ్రహ్మానందం తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో ఆడియన్స్ ను అలరించనున్నారు.