నా తల్లి నా గొంతు వినలేక పోయింది
తప్పు చేయనప్పుడు జీవితంలో ఎవరికీ భయపడకూడదని తన గురువు దాసరి తనకు చెప్పారని, అదే తన విద్యాలయాల్లోని విద్యార్థులకు నేర్పిస్తున్నానని చెప్పారు మోహన్ బాబు.
By: Tupaki Desk | 8 Jun 2025 5:55 AMమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రులు తాము పుట్టడం కోసం ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు.
తమ తల్లిదండ్రులకు సంతానం లేకపోవడంతో నాలుగు కిలోమీటర్లు కొలను నడిచి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు అడివిలో నడిస్తే అక్కడో లింగాకారం ఉండేదని, అక్కడికి వెళ్లి భగవంతున్ని ప్రార్థిస్తే తప్పకుండా పిల్లలు పుడతారని ఎవరో చెప్పడంతో, అక్కడికి వెళ్లి ప్రార్థించారని, అలా ఆ పరమేశ్వరుడి దయతో తమ తల్లికి ఐదుగురు సంతానం కలిగారని మోహన్ బాబు చెప్పారు.
తన తల్లికి రెండు చెవులు లేవని చెప్పిన మోహన్ బాబు, తన గొంతుని, తన మాటలను అందరూ మెచ్చుకుంటుంటే, ఆ మాటలు నా తల్లికి కూడా వినిపిస్తే ఎంత బావుండేది పరమేశ్వరా అని ఎన్నోసార్లు అనుకున్నానని మోహన్ బాబు చెప్పారు. జీవితంలో చెప్పులు కూడా లేకుండా, తిండి తినీ తినక ఎంతో కష్టపడి స్వయంకృషితో పైకొచ్చానని ఆయన చెప్పారు.
తప్పు చేయనప్పుడు జీవితంలో ఎవరికీ భయపడకూడదని తన గురువు దాసరి తనకు చెప్పారని, అదే తన విద్యాలయాల్లోని విద్యార్థులకు నేర్పిస్తున్నానని చెప్పారు మోహన్ బాబు. ప్రభాస్ తానూ బావా బావా అని పిలుచుకుంటామని, మానవత్వం, మంచి హృదయమున్న గొప్ప వ్యక్తి ప్రభాస్ అని పేర్కొన్నారు. మోహన్ లాల్ వర్సటైల్ యాక్టర్ అని, ఇండియా గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకరని, కన్నప్పలో చేయమని అడగ్గానే వెంటనే చేస్తానని చేశారని, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం ఇలా ప్రతీ ఒక్కరినీ ఆ భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించాడని అన్నారు. కన్నప్ప సినిమాను ముకేష్ కుమార్ సింగ్ ఎంతో అద్భుతంగా తీశాడని, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆయన అన్నారు.