Begin typing your search above and press return to search.

హార్డ్ డిస్క్ ఇప్పటికీ నా చేతికి రాలేదు.. 100% సేఫ్ కాదు: మంచు విష్ణు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jun 2025 1:30 PM
Manchu Vishnu Breaks Silence on Missing Kannappa Hard Disk
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముంబైకి చెందిన ఓ వీఎఫ్ ఎక్స్ కంపెనీ దాన్ని హైదరాబాద్ పంపగా, చరిత అనే మహిళ తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు మూవీ టీమ్ కంప్లెంట్ చేయగా.. దర్యాప్తు జరుగుతోంది.

అయితే ఇప్పటికే హార్డ్ డిస్క్ మిస్ అయిన వ్యవహారంపై మంచు విష్ణు స్పందించగా, ఇప్పుడు మరోసారి మాట్లాడారు. తన చేతికి ఇప్పటికీ రాలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓ సారి మధ్యవర్తులకు చెప్పి పంపినా ఇవ్వమని చెప్పానని అన్నారు. అందుకే పోలీసులను ఆశ్రయించామని, విచారణ జరుగుతోందని వెల్లడించారు.

"కన్నప్ప వీఎఫ్ ఎక్స్ వర్క్స్.. ముంబైకి చెందిన ఎనిమిది కంపెనీలు చేస్తున్నాయి. అందులో ఒక కంపెనీ ఆన్ లైన్ లో కాస్త వర్క్ ను పంపింది. కానీ అది క్లియర్ గా లేదు. రెండోసారి మళ్లీ పంపింది. అప్పుడు హార్డ్ డిస్క్ లో కూడా సెండ్ చేసింది. అయితే మోహన్ బాబు గారి ముగ్గురు పిల్లలకు చెందిన పార్సిల్స్ ఆ ఇంటికే వస్తాయి" అని చెప్పారు.

"ఆ తర్వాత మేనేజర్స్.. ఎవరికి వచ్చినవి వాళ్లకి ఇస్తారు.. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పుడు కన్నప్ప పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి, చరితను తీసుకోమని చెప్పాడట. ఆమె తీసుకుని వెళ్లిపోయారు. వారిద్దరూ మనోజ్ తో ఉంటారని తెలిసింది. అక్కడ పని చేస్తున్నారో లేదో మాకు మాత్రం తెలియదు" అని తెలిపారు.

"వారిద్దరూ మనోజ్ తో ఉన్నారని.. హార్డ్ డిస్క్ అక్కడే ఉందని సమాచారం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ తర్వాత ఒక మీడియేటర్ ద్వారా మాట్లాడించాం. అయినా ఇవ్వనని చెప్పారు. పోలీసులకు మొత్తం తెలుసు. వాళ్ళు మొత్తం విచారణ చేసి చెబుతారు. ఏదేమైనా నా దగ్గరకు ఇంకా హార్డ్ డిస్క్ అయితే రాలేదు" అని పేర్కొన్నారు.

"అయితే పాస్ వర్డ్ ఉంది కాబట్టి హార్డ్ డిస్క్ సేఫ్ అనుకుంటున్నా.. కానీ ఏ పాస్ వర్డ్ అయినా 99 శాతం సేఫ్ ఉంటుంది. 100 శాతం మాత్రం కాదు. అదే సమయంలో ఒక చిన్న తప్పు వల్ల సుమారు రూ.15 కోట్లు వేస్ట్ అయ్యాయి. ఖరీదైన మిస్టేక్ చేశాం. వీఎఫ్‌ ఎక్స్‌ కు ఎక్కువ బడ్జెట్ అయింది. అంత అవ్వకూడదు. మొత్తం బడ్జెట్ ఇప్పుడు చెప్పను" అని మంచు విష్ణు తెలిపారు.