ఓపెనింగ్స్‌పై కన్నప్ప ధీమా.. విష్ణు కష్టం ఫలించేనా?
సినిమా కెరీర్ లో ప్రతీ హీరో కెరీర్ దిశను మార్చే సినిమాలు దొరకడం చాలా అరుదు. ఇక 20 ఏళ్ళ కెరీర్ లో మొదటిసారి విష్ణుకు కన్నప్ప కథ ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది.
By: Tupaki Desk | 26 Jun 2025 1:28 PM ISTసినిమా కెరీర్ లో ప్రతీ హీరో కెరీర్ దిశను మార్చే సినిమాలు దొరకడం చాలా అరుదు. ఇక 20 ఏళ్ళ కెరీర్ లో మొదటిసారి విష్ణుకు కన్నప్ప కథ ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది. ఇక టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందిన పౌరాణిక చిత్రం కన్నప్ప మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమవుతోంది. మంచు విష్ణు ఈ సినిమాను తన డ్రీం ప్రాజెక్టుగా తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేయగా, ప్రేక్షకుల అంచనాలు కొత్త రికార్డుల వైపు సాగుతున్నాయి. బుక్మైషోలో ముందస్తు బుకింగ్స్ బాగానే నడుస్తుండటంతో సినిమాకు మంచి ఆరంభం దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ప్రభావం ఇందులో కీలకం అవుతోంది. అతను రుద్ర పాత్రలో కనిపించబోతున్నాడు.
అయితే సినిమాలో ప్రభాస్ పాత్ర అరగంట వరకే ఉంటుందని సమాచారం. మిగిలిన మొత్తం చిత్రభాగంలో విష్ణు తానే కథను ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఇంత భారీ బడ్జెట్‌తో మంచు కుటుంబం ఇప్పటివరకు ఏ సినిమాకు ప్రయత్నించలేదు. ఆఫ్ లైన్ టాక్ ప్రకారం సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల వరకూ ఖర్చయ్యిందట. దీనిపై ఖచ్చితమైన వివరాలు బయటకురాలేదు కానీ, మోహన్ బాబు మద్దతుతో విష్ణు ఈ సాహసాన్ని చేపట్టాడు. అలాగే అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి మరి సినిమా తీసినట్లు విష్ణు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
న్యూజిలాండ్ వంటి దేశాల్లో భారీ క్యాస్టింగ్‌తో సినిమా చిత్రీకరణ జరిపారు. మహాభారతాన్ని రూపొందించిన అనుభవమున్న ముకేష్ కుమార్ సింగ్‌ను దర్శకుడిగా ఎంపిక చేయడం విశేషం. ఇటీవల కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఊపులో కన్నప్ప కూడా సక్సెస్ అయితే, తదుపరి రెండు వారాల పాటు స్ట్రాంగ్‌గా నిలవగలదు. ఈ సినిమా నెగటివ్ టాక్ లేకుండా కొనసాగితే, కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సాధించగలదు. కానీ మొదటి వారంలోనే సినిమా టార్గెట్ ను ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషించటం సినిమాకు మరింత పటిష్టత ఇస్తోంది. కాబట్టి మిగతా భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. విష్ణు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది అతని కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది రేపు థియేటర్లలో తేలనుంది. కన్నప్ప ప్రాజెక్ట్ మీద విష్ణుకి ఉన్న ఆశలు నిజమవుతాయా, లేదా అనేది విడుదల తర్వాతే స్పష్టమవుతుంది.
