Begin typing your search above and press return to search.

సింగిల్ ట్రైలర్.. మంచు వారు సీరియస్?

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'కన్నప్ప' సినిమాకు సంబంధించిన టీజర్లో మంచు విష్ణు 'శివయ్యా' అని అరిచే డైలాగ్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   29 April 2025 11:00 PM
సింగిల్ ట్రైలర్.. మంచు వారు సీరియస్?
X

సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొనే టాలీవుడ్ ఫ్యామిలీస్‌లో మంచు వారిది ముందు వరుసలో ఉంటుంది. మంచు ఫ్యామిలీ వారికి చాలా ఏళ్లుగా సరైన విజయాలు లేకపోవడంతో పాటు కుటుంబ వివాదాల వల్ల ట్రోలింగ్ పెరిగిపోయింది. ఐతే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలామంది సోషల్ మీడియా ట్రోలింగ్‌ను స్పోర్టివ్‌గానే తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు సోషల్ మీడియా జనాలు హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. అప్పుడే మంచు విష్ణు, మోహన్ బాబు కొంచెం సీరియస్ అవుతుంటారు. తాజాగా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే తమను టార్గెట్ చేయడంతో మంచు విష్ణు ఆగ్రహానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'సింగిల్' మూవీ ట్రైలర్లో రెండు డైలాగులు మంచు ఫ్యామిలీని హర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'కన్నప్ప' సినిమాకు సంబంధించిన టీజర్లో మంచు విష్ణు 'శివయ్యా' అని అరిచే డైలాగ్ ఉంటుంది. దాన్ని 'సింగిల్' ట్రైలర్లో శ్రీ విష్ణు అనుకరించాడు. అంతే కాక ట్రైలర్ చివర్లో.. ''ఓ మగాడు ఓ అమ్మాయిని ప్రేమించినపుడు తన జీవితం మంచు కురిసిపోతుందని..'' అంటూ సాగే ఒక డైలాగ్ ఉంది. ఒక పచ్చి బూతు మాటకు బదులుగా 'మంచు' అని వాడడంతో ఇది కూడా మంచు వారిని టార్గెట్ చేయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తమ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన డివోషనల్ మూవీలోని డైలాగ్‌ను కామెడీ చేయడం.. దీంతో పాటుగా మరో డైలాగ్‌ కూడా కించపరిచేలా ఉండడం పట్ల మంచు విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని.. అరవింద్ లాంటి పెద్ద వ్యక్తి ప్రొడ్యూస్ చేసిన సినిమాలో ఇలాంటి డైలాగులేంటని ప్రశ్నిస్తున్నాడని.. అంతే కాక 'సింగిల్' టీంకు నోటీసులు పంపాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. మరి ఈ వివాదాస్పద డైలాగుల విషయంలో 'సింగిల్' టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.