కన్నప్ప సినిమా.. క్షమాపణ చెప్పిన మనోజ్
ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయనున్న భైరవం సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.
By: Tupaki Desk | 24 May 2025 1:13 PM ISTఈ నెల 30న థియేటర్లలో సందడి చేయనున్న భైరవం సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో సినిమా గురించి భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తమిళ బ్లాక్‌బస్టర్ ‘గరుడన్’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో మనోజ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఈ ఈవెంట్‌లో మనోజ్ కొన్ని పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ, శివయ్యా అని అలా పిలవడం కాదు.. మనసులో తల్చుకుంటే ఆయన వస్తాడు అంటూ చెప్పిన మాటలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో అనేక మంది విష్ణు అభిమానులు, ‘కన్నప్ప’ టీం సభ్యులు నిరాశ చెందారు. దీనిపై తాజాగా స్పందించిన మనోజ్, తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. "అలా అనడం తప్పుడు అర్థాలకూ దారి తీసింది. ‘కన్నప్ప’ టీంకు, అన్నకి క్షమాపణ చెబుతున్నాను" అని తెలిపారు.
"ఒకరిపై కోపంతో సినిమా మీదే విమర్శ చేయడం సరికాదు. కన్నప్ప సినిమా కోసం ఎంతో మంది కష్టపడ్డారు. మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు వంటి స్టార్లు ఉన్నారు. వాళ్లందరి శ్రమను గౌరవించాలి. భైరవం బ్లాక్‌బస్టర్ కావాలి.. అలాగే కన్నప్ప కూడా భారీ విజయం సాధించాలి" అంటూ మనోజ్ కూల్ గానే స్పందించారు. ఇది చూసిన నెటిజన్లు ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకుముందు మానసిక ఒత్తిడి, కుటుంబ విభేదాల నేపథ్యంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి సంపాదించిన ఆస్తిపై తనకు ఎప్పుడూ ఆశ లేకపోయిందని స్పష్టం చేశారు. "అది ఆయన కష్టపడి సంపాదించినది. అడిగే హక్కు కూడా లేదు" అన్నారు. తండ్రి చెప్పిన నైతికతను పాటించడం వల్లే ఈ చిక్కులు వచ్చాయని, అందుకే ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నానని అన్నారు.
అంతేగాక, అన్నదమ్ముళ్ల మధ్య సమస్యను తండ్రీకొడుకుల గొడవగా చిత్రీకరించారంటూ మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "మీడియా, పోలీసులను చివరి దశలోనే ఆశ్రయించాను. మా కుటుంబాన్ని పబ్లిక్‌గా చర్చకు తేవాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అనివార్య పరిస్థితుల్లోనే అలా జరిగింది" అని వివరించారు. ప్రస్తుతం భైరవం ప్రమోషన్లతో బిజీగా ఉన్న మనోజ్, ఒకవైపు సినిమాపై అంచనాలు పెంచుతూనే, వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ ఓ బాధ్యతాయుతమైన వైఖరిని చూపారు.
