ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తా.. ఆ డైలాగ్ నాదే!
ఐకానిక్ డైలాగ్‌లు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లు, మీమ్స్ సంస్కృతి… ఇవన్నీ కలిసి ఇప్పుడు సెలబ్రిటీల చుట్టూ కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 10 March 2026 9:00 PM ISTఐకానిక్ డైలాగ్‌లు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లు, మీమ్స్ సంస్కృతి… ఇవన్నీ కలిసి ఇప్పుడు సెలబ్రిటీల చుట్టూ కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. తాజాగా నటిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లేచింది మహిళా లోకం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ట్రెండ్ అవుతున్న ఫ్లవర్- ఫైర్ డైలాగ్
ప్రత్యేకంగా సినిమాలో వినిపించే ఫ్లవర్- ఫైర్ తరహా డైలాగ్ కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోలికలు మొదలయ్యాయి. చాలా మంది నెటిజన్లు ఆ డైలాగ్‌ను పుష్ప మూవీలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తో కంపేర్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాను ఊపేసిన ఆ డైలాగ్‌కు ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చిందన్నట్లుగా మీమ్ పేజీలు ట్రెండ్ చేస్తుండటం గమనార్హం.
ఆ డైలాగ్ నాదే!
కాగా తాజాగా ఈ కంపేరిజన్స్ పై మంచు లక్ష్మి స్పందించారు. ఆ డైలాగ్ ను కాపీ వివాదంగా చూడాల్సిన అవసరం లేదని.. పుష్ప2 సినిమా కంటే చాలా ముందే తమ సినిమా షూటింగ్ పూర్తైందని, ఆ డైలాగ్ కూడా అప్పుడే చెప్పిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు కేవలం యాదృచ్ఛికమేనని చెప్పారు లక్ష్మి. అంతేకాదు, తన డైలాగ్ కాపీ కాదని, ముందుగా ఆ డైలాగ్ ను తానే చెప్పానని కూడా ఆమె ఈ సందర్భంగా సుకుమార్ కు క్లారిటీ ఇచ్చారు.
ఏం అనిపిస్తే అది మాట్లాడటమే!
సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌లు, మీమ్స్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఇలాంటి ట్రోలింగ్ చూసి ఆందోళన చెందే దాన్నని, ఇప్పుడు మాత్రం వాటిని చాలా లైట్‌గా తీసుకుంటానని చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరికైనా కామెంట్లు చేయాలనిపిస్తే చేయొచ్చని, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగడమే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే తన ధోరణి కూడా మారిందని మంచు లక్ష్మి చెప్తున్నారు. మొదట్లో మీడియాతో మాట్లాడేటప్పుడు ప్రతి మాటను చాలా జాగ్రత్తగా తూకం వేసుకుని చెప్పేదాన్నని, ఇప్పుడు మాత్రం ఏం అనిపిస్తే అది ఓపెన్‌గా చెప్పగలుగుతున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత యాటిట్యూడ్‌లో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.
మొత్తానికి ఒక డైలాగ్ చుట్టూ మొదలైన ఈ డిస్కషన్.. ఇప్పుడు సోషల్ మీడియా మీమ్స్, పోలికల వరకు వెళ్లింది. ఒకప్పుడు వైరల్ అయిన డైలాగ్ ఇప్పుడు మరో విధంగా చర్చనీయాంశం కావడం ఆసక్తికరంగా మారింది.
