ట్రైలర్ టాక్: ఇద్దరు సూపర్‌స్టార్లు సూపర్ యాక్షన్ థ్రిల్లర్
భారతీయ చిత్ర పరిశ్రమలో స్క్రిప్టుల ఎంపిక విషయంలో మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాతే ఎవరైనా.
By: Sivaji Kontham | 5 April 2026 1:28 PM ISTభారతీయ చిత్ర పరిశ్రమలో స్క్రిప్టుల ఎంపిక విషయంలో మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాతే ఎవరైనా. ఆ ఇద్దరి ఎంపికలు వేరే లెవల్. కథా బలమున్న చిత్రాలను ఎంచుకోవడంలో తమ ప్రత్యేకతను మరోసారి నిరూపిస్తూ.. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు `పేట్రియట్` చిత్రంతో వెండితెరపై సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. పర్ఫెక్ట్ పాన్ ఇండియా కంటెంట్‌తో రూపొందిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. నేటి జనరేషన్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులతో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వబోతోందని ట్రైలర్ చెబుతోంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆధారంగా కథాంశాన్ని గమనిస్తే... ఇది ఒక పవర్‌ఫుల్ స్పై థ్రిల్లర్ (గూఢచారి కథ) అని అర్థమవుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పోరాటంలో మమ్ముట్టి పాత్ర అత్యంత నిగూఢంగా ఉంది. ట్రైలర్‌లో ``సర్ మీరు టెర్రరిస్టా? లేక పోలీసా?`` అని అడిగే ప్రశ్నకు.. ఆయన సమాధానం ఆశ్చర్యపరుస్తుంది. అతడు పోలీస్ కాదు టెర్రరిస్టు కాదు పేట్రియట్ అనేలా సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించే ఒక గూఢచారి కథగా మహేష్ నారాయణన్ ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్‌తో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో సాఫ్ట్ వేర్ రంగం - టెక్నాలజీ- డేటా సెంటర్ల గురించి చూపిస్తుండటం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. అమెరికన్ టెక్ కంపెనీలను లేపేస్తానని ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన ఇలాంటి సముచిత సందర్భంలో ఈ సినిమా వస్తుండటం కూడా ఆసక్తిని కలిగిస్తోంది.
2008లో వచ్చిన `ట్వంటీ:20` తర్వాత మళ్ళీ లాల్- మమ్ముట్టి స్నేహితులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ భారీ గూఢచారి డ్రామాలో నయనతార, కుంచాకో బోబన్, రేవతి వంటి దిగ్గజ తారాగణం నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపిస్తున్నారని విజువల్స్ చెబుతున్నాయి.
ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓపెనింగ్ ఫిల్మ్‌గా `పేట్రియట్`ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కె.జి. అనిల్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. తొలుత ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల 1మే 2026కి వాయిదా పడింది. విడుదల తేదీ మారినా క్రేజ్ తగ్గదని తాజాగా విడుదలైన ట్రైలర్ నిరూపిస్తోంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్ల కలయిక కోసం కేరళతో పాటు తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మమ్ముట్టి, మోహన్ లాల్ తమ కెరీర్‌లో బిజీగా ఉంటూనే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం విశేషం. మోహన్ లాల్ తదుపరి `దృశ్యం 3`తో మే 21న అభిమానుల ముందుకు రాబోతుండగా.. మమ్ముట్టి దాదాపు 32 ఏళ్ల తర్వాత అడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో `పదయాత్ర` అనే చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం మే 1న విడుదల కానున్న`పేట్రియట్` పైనే ఉంది. ట్రైలర్ ఉత్కంఠను పెంచడంతో ఇప్పుడు టాలీవుడ్ లోను దీనిపై ఆసక్తికర చర్చ మొదలైంది.
