Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన క్లాష్

మరోవైపు.. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆకాశంలో ఒక తార` చిత్రంలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2026 4:00 PM IST
టాప్ స్టోరి: బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన క్లాష్
X

చలనచిత్ర పరిశ్రమలో తండ్రీకొడుకులు లేదా ఒకే కుటుంబానికి చెందిన అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎదురుపడటం లేదా ఒకే సీజన్‌లో పోటీ పడటం చాలా అరుదైన విషయం. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాల బాక్సాఫీస్ క్లాష్ తరహాలోనే గతంలో ప‌లు ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన సందర్భాలు ఎదురయ్యాయి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి .. ఆయన కుమారుడు, యువ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ వచ్చే నవంబర్ 20న బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడనున్నారు. గతంలో వీరి సినిమాలు ఒకే సీజన్‌లో విడుదలైనా.. ఈసారి మాత్రం ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుండటం విశేషం.

మమ్ముట్టి నటిస్తున్న పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా `ఓం - చాప్టర్ 1: ఉధిరం - ది బ్లడ్ వుడ్`.. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బ‌హుభాషా రోమాంటిక్ డ్రామా `ఆకాశంలో ఒక తార` సినిమాలు రెండూ నవంబర్ 20నే విడుదలను లాక్ చేసుకున్నాయి. జానర్లు -భాషల పరంగా పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ రెండు సినిమాల మధ్య పోటీ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వంలో మమ్ముట్టి, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న`ఓం`పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. అడవి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో పోలీసులు అరెస్ట్ చేసిన కలప కార్మికులను రక్షించే వ్యక్తిగా మమ్ముట్టి కనిపించనున్నారు.

మరోవైపు.. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆకాశంలో ఒక తార` చిత్రంలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా సంయుప్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తండ్రీకొడుకుల ఈ క్రేజీ బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచనుంది. గతంలో మలయాళంలో మమ్ముట్టి నటించిన చిత్రాలు.. దుల్కర్ సినిమాలు ఈద్ సీజన్‌లో దాదాపు ఒకే సమయంలో బాక్సాఫీస్ రేసులో నిలిచిన అనుభవాలున్నా.. నేరుగా ఒకే రోజు విభిన్న జానర్లతో బరిలోకి దిగుతుండటం ఇదే మొదటిసారి.

టాలీవుడ్ - కోలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోల‌ క్లాష్‌లు

టాలీవుడ్ స‌హా ఇతర సౌతిండియా భాషల్లో తండ్రీకొడుకుల చిత్రాల పోటీ ప‌డ‌టం కానీ.. ఒకే సీజన్ విడుదలలను పరిశీలిస్తే.. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ సినిమాలు ఒకే సీజన్‌లో పోటీప‌డిన సంద‌ర్భాలేవీ లేవు కానీ.. ఒకే నెల‌లో విడుద‌లైన సంద‌ర్భాలున్నాయి. చాలా వ‌ర‌కూ మెగా సినిమాలు ఒకే తేదీ లేదా ఒకే రోజు విడుద‌ల కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నాగార్జున - నాగచైతన్య సైతం కెరీర్ ఆరంభం నుండి తమ సినిమాలను ఒకే రోజు విడుదల చేయకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే.. లెజెండరీ యాక్టర్ కార్తీక్ .. ఆయన కుమారుడు గౌతమ్ కార్తీక్ సినిమాల మ‌ధ్య పోటీ.. లేదా ద‌ళ‌ప‌తి విజయ్ కెరీర్ తొలినాళ్లలో ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వ‌హించిన సినిమాలు ఒకే సమయంలో పోటీప‌డ‌టంపైనా చ‌ర్చ సాగింది.

బాలీవుడ్- శాండ‌ల్‌వుడ్- మాలీవుడ్‌లో ఆసక్తికర పోటీ

బాలీవుడ్‌లో ధర్మేంద్ర, సన్నీడియోల్, బాబీ డియోల్ వంటి అగ్ర కుటుంబానికి చెందిన హీరోల చిత్రాలు వేర్వేరు సమయాల్లో వస్తున్నా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద పండగ సీజన్లలో తండ్రి లేదా కొడుకు సినిమాలు ఒకే వీకెండ్‌లో ఎదురుపడిన దాఖలాలున్నాయి. అలాగే శాండ్‌వుడ్ (కన్నడ) లో రాజ్‌కుమార్ కుటుంబం (డా. రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్) ... మాలీవుడ్ లోనే మోహన్‌లాల్, మమ్ముట్టి కుటుంబాల నుండి ఒకే సీజన్‌లో సినిమాల‌తో పోటీ పడిన సందర్భాలున్నాయి. ఇలాంటి తండ్రీకొడుకుల లేదా స్టార్ హీరోల క్లాష్‌లు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ప్రత్యేక చర్చకు దారితీస్తూ.. అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచుతుంటాయి.