స్టార్ హీరో మూవీ విషయంలో డైరెక్టర్ అసహనం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్.
By: Tupaki Desk | 10 April 2025 3:00 PM ISTమలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ సినిమాను మమ్ముట్టి తన సొంత బ్యానర్ లో నిర్మించారు. మిస్టరీ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరిలో రిలీజైంది. ఈ సినిమాలో మమ్ముట్టి డొమినిక్ అనే డిటెక్టివ్ రోల్ లో నటించారు.
హాస్పిటల్ లో దొరికిన లేడీస్ పర్స్ కు సంబంధించిన కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ లేడీస్ పర్స్ ఎవరిది? అసలు అందులో ఏముంది? ఆ పర్స్ కు జరుగుతున్న మర్డర్స్ కు సంబంధమేంటి అనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అసలు ఎప్పుడు థియేటర్లలోకి వచ్చింది? ఎప్పుడు థియేటర్ల నుంచి పోయిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు.
తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు. తమ సినిమా రిలీజ్ అయిందనే విషయం చాలా మందికి తెలియలేదనే అంశం తనను ఎంతో బాధించిందని ఆయన అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన తమ సినిమా చూసిన వాళ్లకు నచ్చిందని, కానీ సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదనే ఫీలింగ్ తనకుందని ఆయన అన్నారు.
సినిమాకు సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్లే తమ సినిమా థియేటర్లోకి వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియలేదని, సినిమాను ప్రమోట్ చేసి ఉంటే దాని గురించి అందరికీ తెలిసేదని ఆయన అభిప్రాయపడ్డారు. మమ్ముట్టితో సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అని ఇప్పటికీ తనను కొంతమంది అడుగుతున్నారని, మలయాళ ఆడియన్స్ కూడా ఈ విషయం గురించి తనను అడిగడంతో తనకు చిరాకొచ్చినట్టు ఆయన తెలిపారు.
ప్రస్తుతం మమ్ముట్టితో కలిసి గౌతమ్ మీనన్ బజూక అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే బజూక మూవీకి డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాదు. ఆ సినిమాకు డినో డెన్సిస్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తన పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని గౌతమ్ మీనన్ వెల్లడించారు. ఎన్నో ట్విస్టులతో రూపొందుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రానుందని గౌతమ్ మీనన్ చెప్పారు.
