Begin typing your search above and press return to search.

మమితా బైజు అదిరిపోయే కమ్‌బ్యాక్.. నిన్న విమర్శలు, నేడు ప్రశంసలు!

ఇండ్రస్ట్రీ లో వరస ప్లాపులు, దారుణమైన ట్రోలింగ్‌తో సతమతమైన నటి మమితా బైజు చివరికి ఊహించని రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు.

By:  Madhu Reddy   |   17 Aug 2026 11:17 AM IST
మమితా బైజు అదిరిపోయే కమ్‌బ్యాక్.. నిన్న విమర్శలు, నేడు ప్రశంసలు!
X

ఇండ్రస్ట్రీ లో వరస ప్లాపులు, దారుణమైన ట్రోలింగ్‌తో సతమతమైన నటి మమితా బైజు చివరికి ఊహించని రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా మమిత నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

మలయాళ చిత్రసీమలో బాలనటిగా ప్రయాణం ప్రారంభించి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటనలో మెరుగులు దిద్దుకున్న మమిత బైజుకి 2024 సంవత్సరం ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. ఆ ఏడాది కథానాయకిగా ఆమె నటించిన ‘ప్రేమలు’ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించి మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో కూడా ఆమెకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.

ట్రోల్స్ నుంచి తిరుగులేని ప్రశంసల వరకు:

తమిళంలో ‘రెబెల్’ సినిమాతో అడుగుపెట్టిన మమితా బైజుకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత ‘డ్యూడ్’ చిత్రంతో కొంత ఉపశమనం లభించినా, ధనుష్‌తో చేసిన ‘కారా’, ఆ తర్వాత వచ్చిన ‘జననాయగన్’ సినిమాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇక తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా వచ్చిన ‘జననాయగన్’లో శ్రీలీల చేసిన పాత్రను మమిత పోషించారు. అయితే ఆ పాత్రకు ఆమె సెట్ అవ్వలేదని, అసలు నటించడమే రాదని సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

సూర్యతో పోటీపడి మరీ అద్భుత నటన:

అయితే ఆ విమర్శలన్నిటికీ మమిత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో సరైన సమాధానం చెప్పారు. ఈ చిత్రంలో సూర్యతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంటూ, తన నటనతో సినిమాను ముందుకు నడిపించారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఇక సినిమాలో ఆమె పండించిన ఎమోషన్స్, సరదా సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇది ఆమె కెరీర్‌లోనే ఉత్తమ నటన అని సినీ విశ్లేషకులు కూడా ప్రశంసిస్తున్నారు.

సొంతం చేసుకున్న తిరుగులేని గుర్తింపు:

నిన్నటివరకు ఆమె నటనపై అనుమానాలు వ్యక్తం చేసినవారే, ఇప్పుడు ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్స్ లో మమితా బైజు అత్యుత్తమ నటి అని, కోలీవుడ్‌లో త్వరలోనే అగ్ర కథానాయికగా వెలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా విశ్వనాథ్ అండ్ సన్స్ విజయంతో మమిత తన కెరీర్‌కు మళ్లీ బలమైన పునాది వేసుకున్నారు.

ఓటమి ఎదురైన చోటే తన ప్రతిభను నిరూపించుకుని నిలబడటం సామాన్యమైన విషయం కాదు. నెగెటివ్ కామెంట్స్ ఎదురైనా కుంగిపోకుండా, సరైన పాత్రను ఎంచుకుని తన నటనతో అందరి నోళ్లు మూయించిన మమితా బైజు ప్రయాణం నిజంగా అభినందనీయం. రాబోయే రోజుల్లో తమిళ పరిశ్రమలో ఆమె ఎలాంటి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుని దూసుకుపోతుందో వేచి చూడాలి.