సూర్యతో నటించడం ఎంతో మంది అమ్మాయిల కల.. నెరవేరినందుకు హ్యాపీ: మమితా బైజు
అలాగే తనకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు నిర్మాత నాగవంశీకి, దర్శకుడు వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలిపారు.
By: Sivaji Kontham | 3 Aug 2026 11:53 PM ISTసౌత్ ఇండియా వెర్సటైల్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `విశ్వనాథ్ అండ్ సన్స్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఆడియో విడుదల వేడుక కోయంబత్తూర్‌లోని హిందూస్థాన్ కాలేజ్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయిక మమితా బైజు పాల్గొని వేదికపై తన ఆనందాన్ని షేర్ చేసారు. తమిళ ప్రేక్షకులతో ముచ్చటిస్తూ.. కోయంబత్తూర్ కాలేజ్ విద్యార్థుల ఎనర్జీ, ఉత్సాహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
హీరో సూర్యతో కలిసి నటించడం తన డ్రీమ్ అని మమితా తెలిపారు. సూర్య సెట్‌లో పాటించే క్రమశిక్షణ, ఒక సన్నివేశాన్ని అర్థం చేసుకుని నటించే విధానం.. ఆఫ్‌స్క్రీన్‌లో ఆయన ప్రవర్తించే తీరు ఎంతోమందికి గొప్ప ప్రేరణ అని కొనియాడారు. సూర్య పక్కన కథానాయికగా నటించడం ద్వారా ఈ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు కనే కలను తాను నిజంగా జీవిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఈ గొప్ప అవకాశం అందించినందుకు సూర్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే తనకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు నిర్మాత నాగవంశీకి, దర్శకుడు వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలిపారు. వెంకీ అట్లూరి తన పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని...ఆయన పనితీరు ఎంతో కూల్‌గా ఉంటుందని ప్రశంసించారు. వెంకీ మేకింగ్ శైలి తనకు ఎంతో ఇష్టమని.. భవిష్యత్తులో కూడా ఆయన దర్శకత్వంలో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ... ఈ చిత్రంలోని పాటలు తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు. అలాగే సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సెట్‌లో రాధికా మ్యాడమ్‌తో ఎంతో సరదాగా స్నేహితురాలిలా మెలిగానని... వేడుకలో ఆమె లేకపోవడాన్ని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు.
చివరగా కంగారులో సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 14 అని చెప్పి, వెంటనే సరిదిద్దుకుంటూ ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గుర్తుచేశారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి పెద్ద విజయాన్ని అందించాలని మమితా బైజు ప్రేక్షకులను, అభిమానులను కోరారు.
మమితా బైజు 2026 సంవత్సరంలో సౌత్ ఇండియాలోని ప్రధాన భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. కోలీవుడ్‌లో సూర్యకు జోడీగా నటిస్తున్న భారీ చిత్రం `విశ్వనాథన్ అండ్ సన్స్` విడుదలకు సిద్ధమవుతుండగా.. విష్ణు విశాల్ సరసన ఒక కోలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ, అలాగే మరికొన్ని తెలుగు, తమిళ కథలను ఓకే చేసారని తెలుస్తోంది. `ప్రేమలు` సినిమా ఇచ్చిన ఊపుతో 2026లో వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ మమిత తన సినీ ప్రయాణంలో మరో మెట్టు పైకి ఎదుగుతున్నారు.
