బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ 'మాలిక్' కథ.. ఎలా ఉందంటే?
ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశామనిపించే ఈ కథను దర్శకుడు పులకిత్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సమస్య ఏంటంటే.. కథ ఫ్రెష్ కాకపోవడమే.
By: Tupaki Desk | 11 July 2025 10:35 PM ISTబాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా మాలిక్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డా, థియేటర్లలో మాత్రం ఆ హైప్ కొనసాగలేకపోయింది. పులకిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ పరంగా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు దీపక్, పరిస్థితుల వలయంలో పడుతూ మాలిక్‌గా మారుతాడు. అలహాబాద్ అనే నగరంలో అతని పేరే భయం కలిగించేలా మారుతుంది. రాజకీయ నాయకులు, గ్యాంగ్ స్టర్స్, పోలీసులూ అతనిని ఎదుర్కోవడానికి వెనుకాడతారు. కానీ అతని ఎదుగుదల ఆగిపోదు. ఆయనను అడ్డుకునేందుకు మరో గ్యాంగ్, ఎమ్మెల్యే, మంత్రి కలిసి ఓ ప్లాన్ వేస్తారు. దీనికోసం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రభు దాస్‌ను రంగంలోకి దిస్తున్నారు. కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది.
ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశామనిపించే ఈ కథను దర్శకుడు పులకిత్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సమస్య ఏంటంటే.. కథ ఫ్రెష్ కాకపోవడమే. స్క్రీన్‌ప్లే కూడా కొద్దిగా బోరింగ్‌గా సాగుతుంది. సినిమా ఆరంభం బాగానే మొదలవుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో సీన్స్ రొటీన్ గా, నీరసంగా ఉండటం కథను బలహీనంగా మారుస్తాయి. అలాంటి గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఉండాల్సిన ఇంటెన్సిటీ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది.
రాజ్ కుమార్ రావ్ నటన పరంగా తన శైలిలో బాగా చేశాడు. కానీ మాలిక్ పాత్రకు కావాల్సిన మాస్ యాటిట్యూడ్ బాగా కన్విన్స్ కాకపోవడం కొంత నిరాశ కలిగించుతుంది. మానుషి చిల్లర్ పాత్రను కథలో పెద్దగా వాడుకోలేదనిపిస్తుంది. సౌరభ్ శుక్లా, ప్రొసేన్‌జిత్ ఛటర్జీ వంటి విలక్షణ నటులు ఉన్నా కూడా, వారి పాత్రలకు బలం లేకపోవడంతో వారు కూడా జాడ తప్పారు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిగ్గా సపోర్ట్ చేసాయి కానీ, పెద్దగా హైలైట్ అయ్యేలా లేదు.
దర్శకుడు పులకిత్ తన దృష్టిలో ఇది డిఫరెంట్ గ్యాంగ్ స్టర్ స్టోరీ అనుకున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రేక్షకులు ఇప్పటికే ఇలాంటి కథలు ఎన్నో సార్లు చూశారు. కొత్త బెలూన్ ఊదినా, అందులో గాలి పాతదై ఉంటే అదేం ఉపయోగం? అదే ఈ సినిమా పరిస్థితి. హిందీ బెల్ట్‌లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ మిశ్రమంగా ఉండగా, సౌత్‌లో పెద్దగా పట్టువచ్చేలా లేదు. మొత్తంగా చెప్పాలంటే, మాలిక్ సినిమా రాజ్ కుమార్ రావ్ అభిమానులకు ఓకే అనిపించవచ్చు కానీ, కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నవారికి నిరాశే.
