Begin typing your search above and press return to search.

విద్యా వ్యవస్థను మార్చిన సినిమా.. ప్రభుత్వాల్లో కదలిక

మలయాళ సినిమా 'స్థానార్థి శ్రీకుట్టన్‌' అనే సినిమా పాఠశాల విద్య గురించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎలా ఉంటారు అనే విషయాన్ని చూపిస్తూ సినిమా కథ సాగుతుంది.

By:  Tupaki Desk   |   16 July 2025 3:00 PM IST
విద్యా వ్యవస్థను మార్చిన సినిమా.. ప్రభుత్వాల్లో కదలిక
X

సినిమా ఇండస్ట్రీ సమాజంలో ఎంతో కొంత మార్పును తీసుకు వస్తుంది. హీరోల పాత్రల ప్రభావం యూత్‌ పై ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు సినిమాల్లోని హీరోల పాత్రలను ఆదర్శంగా తీసుకుని మంచి పనులు లేదా చెడు పనులు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభుత్వాలు, వ్యవస్థలు సినిమాలను ఆదర్శంగా తీసుకోవడం ఎక్కడా జరగలేదు. సినిమాల్లో వచ్చే సన్నివేశాలను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఎక్కడా లేదు. అయితే గత ఏడాది చివర్లో వచ్చిన ఒక మలయాళ సినిమా మొత్తం ప్రభుత్వ విధానాలను మార్చేస్తుంది. వందల ఏళ్లుగా ఉన్న విద్యా వ్యవస్థ తీరును మార్చేసింది.

మలయాళ సినిమా 'స్థానార్థి శ్రీకుట్టన్‌' అనే సినిమా పాఠశాల విద్య గురించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎలా ఉంటారు అనే విషయాన్ని చూపిస్తూ సినిమా కథ సాగుతుంది. నలుగురు అల్లరి పిల్లల గురించి ఈ సినిమా కథ. వారిని సక్రమమైన మార్గంలో పెట్టే కథాంశంతో ఆ సినిమా సాగింది. శ్రీకుట్టన్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు వినేష్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. పీఎస్‌ జయహరి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో బ్యాక్ బేంచ్ సిస్టంను తొలగించాలని చక్కని స్క్రీన్‌ప్లేతో చెప్పడం జరిగింది. బ్యాక్ బెంచ్‌ల్లో ఉన్న విద్యార్థులు తమ యొక్క ప్రతిభను చూపించడం లేదు. బ్యాక్‌ బెంచర్స్‌ అంటే చదువురాని వారు అనే అభిప్రాయం పడిపోయింది. ఆ విషయాన్ని హైలైట్‌గా చేస్తూ ఆ సినిమాను చేయడం జరిగింది.

గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్థానార్థి శ్రీకుట్టన్‌ సినిమా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. క్లాస్‌ రూంలో బెంచ్‌లు ఇకపై యూ ఆకారంలో ఉండేలా నిర్ణయం తీసుకుంది. బ్యాక్ బెంచ్ అనేది లేకుండా స్కూల్స్‌ ని అన్ని క్లాస్‌ల్లో బెంచ్‌ల ఏర్పాటును కేరళ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇప్పటికే చాలా స్కూల్స్‌ లో బ్యాక్‌ బెంచ్‌ లు లేకుండా చేసింది. కేరళలో ఇలాంటి విద్యా వ్యవస్థ మార్పులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మార్పు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరి చందన గొప్ప నిర్ణయం తీసుకుని బ్యాక్‌ బెంచ్‌లు లేకుండా చేశారు.

ఇటీవల కలెక్టర్‌ దాసరి హరి చందన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను సందర్శించారు. ఆ సమయంలో తరగతి గదిలో బ్యాక్‌ బెంచ్‌ లు లేకుండా చూడాలని సూచించారు. ఇంకా పలు రకాల సూచనలు స్కూల్‌ ప్రిన్స్‌పల్‌కి ఆమె చేశారు. అందులో ప్రధానంగా క్లాస్‌లోని బెంచ్‌లు ఒకదాని వెనుక ఒకటి కాకుండా సమాంతరంగా టీచర్‌కి అన్ని సమ దూరంలో ఉండేవిధంగా ప్లాన్‌ చేశారు. ఈ వ్యవస్థ వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, బ్యాక్‌ బెంచర్స్‌ అనే ఆలోచన తగ్గుతుందని, ముందు బెంచ్‌ పిల్లలతో సమానంగా తాము ఉన్నామని వారు అనుకుంటారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి విద్యాలో ముందుకు సాగుతారని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూల్స్‌లోనూ ఈ బ్యాక్‌ బెంచ్‌ అనేది లేకుండా చేయాల్సిన అవసరం ఉందని విద్యా వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.