Begin typing your search above and press return to search.

నటి ఫిర్యాదుతో మలయాళ ప్రముఖ దర్శకుడు అరెస్టు

ప్రముఖ మలయాళ దర్శకుడు.. ఇటీవల కాలంలో నటుడిగా బిజీ అయిన రంజిత్ బాలక్రిష్ణన్ తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

By:  Garuda Media   |   1 April 2026 9:24 AM IST
నటి ఫిర్యాదుతో మలయాళ ప్రముఖ దర్శకుడు అరెస్టు
X

ప్రముఖ మలయాళ దర్శకుడు.. ఇటీవల కాలంలో నటుడిగా బిజీ అయిన రంజిత్ బాలక్రిష్ణన్ తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై కొచ్చి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక యువనటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయన అరెస్టు కావాల్సి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఒక సినిమా సెట్ లో ఆయన యువ నటి పట్ల అనుచితంగా ప్రవర్తించటం.. దీనిపై ఆ నటి ఫిర్యాదు చేయటంతో ఇప్పుడు జైలు ఊచలు లెక్కించక తప్పలేదు.

మలయాళ చిత్రపరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవటమే కాదు.. పలు అవార్డుల్ని సొంతం చేసుకున్న ఆయన.. ఇటీవల కాలంలో తన వివాదాస్పద తీరుతో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా అరెస్టు అయిన దుస్థితి. రంజిత్ బాలకృష్ణన్ కు మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన దర్శకుడిగా.. స్క్రిప్టు రైటర్ గా పేరుంది. నిర్మాతగా.. నటుడిగా ఆయనకు మంచి పేరుంది. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్ని రూపొందించారు. 2001లో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన రావణప్రభు సినిమాతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా మారక ముందు దేవాసురం.. ఆరాం తంబురాన్ లాంటి క్లాసికల్ సినిమాలకు కథలు అందించిన ఘన చరిత్ర ఉంది. అయితేనేం.. వ్యక్తిగత వ్యవహారశైలితో ఆయన ఇటీవల కాలంలో వివాదాల్లో వ్యక్తిగా మారారు.

పలు అవార్డులతో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ గా పని చేసిన ఆయన.. 2024-25లో ఆయనపై కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కావటంతో అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రంజిత్ బాలకృష్ణన్ ఈ మధ్యన నటుడిగామంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో వచ్చిన భీమ్లానాయక్ మూవీ ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియుమ్ అన్న మలయాళ చిత్రమన్న సంగతి తెలిసిందే. నిజానికి భీమ్లానాయక్ తెలుగులో రీమేక్ చేసే నాటికే మలయాళంలో ఈ మూవీని ఓటీటీలో చాలామంది చూశారు. ఈసినిమాలో పృథ్వీరాజ్ తండ్రిగా నటించారు. ఈ పాత్రకు ప్రశంసలు లభించాయి. ఈ పాత్రను తెలుగులో సముద్రఖని పోషించారు.

సదరు నటి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి ముందు చిత్రయూనిట్ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి కంప్లైంట్ చేశారు. సదరు సభ్యుల టీం ఆ ఫిర్యాదును పరిశీలించి.. తీవ్రమైనదిగా గుర్తించారు. దీంతో తదుపరి చర్యల కోసం కేసును కేరళ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో.. ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు రంజిత్ బాలక్రిష్ణన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మలయాళ సినీ రంగంలో వరుసగా బయటపడుతున్న వేధింపు కేసుల్లో ఇదొకటి కావటం గమనార్హం. 2024లోనే రంజిత్ మీద బెంగాలీ నటి ఒకరు చేసిన వేధింపు ఆరోపణలతోనే ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న విషయం తెలిసిందే. గతంలో తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చినా..తాజాగా మరో ఫిర్యాదు ఆయనపై రావటంతో ఈసారి ఉచ్చు బిగిసినట్లైంది.