మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర ఆందోళన!
మాలీవుడ్ సీనియర్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్ (57) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
By: Srikanth Kontham | 7 Jun 2026 8:30 AM ISTమాలీవుడ్ సీనియర్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్ (57) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శనివారం ఉదయం ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సలీం కుమార్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే మలయాళ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని తదుపరి హెల్త్ బులెటిన్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. సలీం త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సహనటులు, లక్షలాది మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా సలీం కుమార్ తీవ్రమైన కాలేయ సంబంధిత (లివర్) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో ఆయన లివర్ సిరోసిస్ బారిన పడ్డారు. దీనిపై ఆయన పలు సందర్భాలలో బహిరంగంగానే మాట్లాడారు. ఈ వ్యాధి కారణంగా కొన్నేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగింది. నాటి నుండి ఆయన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపిక చేసిన చిత్రాలలో మాత్రమే నటిస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు సలీం కుమార్ నాటకరంగం -మిమిక్రీ వేదికలపై ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1997లో విడుదలైన `ఇష్టమాను నూరు వట్టం` అనే సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు.
ఆ తర్వాత `కల్యాణరామన్`, `పంజాబీ హౌస్`, `సి.ఐ.డి. మూసా`, `ఈ పరక్కుం తలిక వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో మలయాళ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. హాస్యనటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన, ఆ తర్వాత సీరియస్ క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లారు. హాస్యనటుడిగానే కాకుండా భావోద్వేగ పాత్రలను కూడా అద్భుతంగా పండించగలనని నిరూపించారు. `అచ్చనురంగత వీడు` అనే చిత్రంలో ఆయన నటనకుగానూ తొలిసారి కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. అటుపై 2010లో `ఆదామింటే మకన్ అబు`చిత్రంలో వృద్ధుడి పాత్రలో ఆయన కనబరిచిన నటనకుగానూ ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది.
కేవలం జాతీయ అవార్డే కాకుండా ఆయన సినీ జీవితంలో నాలుగు సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన `ఆజాది`, `భా భా బా` వంటి చిత్రాలలో నటించారు. ఆయన కుమారుడు చందు సలీం కుమార్ కూడా `మాలిక్`, `మంజుమ్మెల్ బాయ్స్` వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సలీం కుమార్ సామాజిక, రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ ఉండేవారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమికి బహిరంగంగా మద్దతు తెలిపారు.
