దెయ్యం అంటే భయం అందుకే పెళ్లి వద్దు..!
మలయాళ మూవీ 'పట్టం పోల్'తో 2013లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.
By: Tupaki Desk | 19 Jun 2025 7:00 PM ISTమలయాళ మూవీ 'పట్టం పోల్'తో 2013లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. దశాబ్ద కాలంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడు ఇన్నాళ్లు తెలుగు సినిమాల వైపు రాలేదు. కానీ ఈమె నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దాంతో తెలుగు ప్రేక్షకుల్లో మాళవిక మోహనన్ కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో రెండు మూడు ఏళ్ల క్రితమే ఆఫర్లు వచ్చినప్పటికీ సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలస్యం చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ప్రభాస్ హీరోగా రూపొందిన రాజాసాబ్ సినిమాతో ఎంట్రీకి సిద్ధం అయింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇదే ఏడాది డిసెంబర్‌లో రాజాసాబ్ సినిమాతో మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక మోహనన్ అప్పుడప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వస్తుంది. తాజాగా కూడా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో ఒక అభిమాని తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు. అందుకు సరదాగా నాకు దెయ్యాలు అంటే భయం అంటూ చెప్పుకొచ్చింది. ఆ అభిమాని అకౌంట్‌కి పేరు కాకుండా ఘోస్ట్ అని ఉండటంతో సరదాగా మాళవిక ఇలా సమాధానం ఇచ్చింది. దెయ్యం అంటే భయం కనుక నిన్ను పెళ్లి చేసుకోను అన్నట్లుగా మాళవిక చేసిన సరదా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులతో ఇలా కలిసి పోయి సరదాగా కామెంట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో మరింతగా ఫాలోయింగ్ పెరుగుతుంది.
నెట్టింట మాళవిక మోహనన్ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలకు కూడా ఎంతో మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆమె అందానికి ఫిదా అయ్యి ఎంతో మంది పెళ్లి చేసుకుందాం, ప్రేమిస్తున్నాను అంటూ కామెంట్ చేస్తారు. వాటన్నింటిని కూడా మాళవిక సరదాగా తీసుకుంటుంది. కొన్నింటికి సమాధానంగా లవ్ ఈమోజీలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి తన అభిమానుల పట్ల అభిమానం కనబర్చుతూ ఇలా సరదాగా వారికి కామెంట్ చేయడం ద్వారా మరింతగా దగ్గర అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అందమైన ఫోటోలతో వైరల్ అవుతూ ఉండే ఈ అమ్మడు ఈసారి మాత్రం ఈ సరదా కామెంట్ కారణంగా వార్తల్లో నిలిచింది.
ఇటీవల రాజాసాబ్ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ... ప్రభాస్ గారితో మొదటి రోజు షూటింగ్ అనుభవం ఎప్పటికీ మరచి పోలేను. రాసాసాబ్ కి ముందు మరో సినిమా షూటింగ్ కారణంగా చాలా అలసి పోయాను. దాంతో రాజాసాబ్ సినిమా షూటింగ్‌కు జాయిన్ అయిన సమయంలో కనీసం ఓపిక లేదు. కానీ ప్రభాస్ గారిని ఎప్పుడైతే చూశానో.. ఎప్పుడైతే ఆయన్ను కలిశానో అప్పుడు నాలో ఉన్న అలసట మొత్తం పోయిందని మాళవిక చెప్పుకొచ్చింది. రాజాసాబ్ సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే టాలీవుడ్‌లో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈ అమ్మడు మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలకు జోడీగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఆ సినిమాలను మాళవిక 'రాజాసాబ్' విడుదల తర్వాతే కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
