Begin typing your search above and press return to search.

మైదాన్ ట్రైలర్: చ‌క్ దే ఇండియాను గుర్తు చేసింది

మనది అతిపెద్ద దేశం కాదు.. ధనవంతులం కాదు.. ప్రపంచంలోని సగం మందికి మనం ఉన్నామ‌ని కూడా తెలియదు.

By:  Tupaki Desk   |   8 March 2024 4:48 AM GMT
మైదాన్ ట్రైలర్: చ‌క్ దే ఇండియాను గుర్తు చేసింది
X

ఎట్టకేలకు అజయ్‌ దేవగన్‌ మైదాన్‌ ట్రైలర్‌ విడుదలైంది. అంతర్జాతీయ వేదికపై భారత ఫుట్‌బాల్‌ను ఉన్నత స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన రియ‌ల్ లైఫ్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ ప్రయాణానికి సంబంధించిన క‌థ‌న‌మిది. ప్రపంచ ఫుట్‌బాల్ మ్యాప్‌లో భారతదేశాన్ని ఉంచే లక్ష్యంతో విభిన్న నేపథ్యాల ఆటగాళ్లతో ఒక బలీయమైన జట్టును నిర్మించడానికి అవిశ్రాంతంగా కృషి చేసే కోచ్‌గా అజయ్ దేవ‌గ‌న్ న‌టించారు. కోచ్ పాత్ర‌ అంకితభావాన్ని ట్రైలర్‌లో ప్ర‌ద‌ర్శించారు.

``మనది అతిపెద్ద దేశం కాదు.. ధనవంతులం కాదు.. ప్రపంచంలోని సగం మందికి మనం ఉన్నామ‌ని కూడా తెలియదు. ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఆడుతుంది.. కాబట్టి ఫుట్‌బాల్ మనకు గుర్తింపును ఇవ్వ‌గ‌ల‌దు. కాబట్టి భారతదేశం ప్రపంచ స్థాయి జట్టును తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. వచ్చే 10 ఏళ్లలో ఇది జ‌ర‌గాలి`` అని అజయ్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. మైదాన్ ట్రైలర్ సినీ ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ చక్ దే ఇండియా.. అక్షయ్ కుమార్ గోల్డ్ వంటి చిత్రాలను గుర్తు చేసింది.

రెండు చిత్రాలలో SRK.. అక్షయ్ హాకీ కోచ్‌లుగా నటించారు. వారి జట్లకు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంలో సహాయపడ్డారు. ఇప్పుడు అజ‌య్ దేవ‌గ‌న్ ఫుట్ బాల్ కోచ్ గా క‌నిపిస్తున్నారు. ``ట్రైలర్ స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. ఇది చక్ దే ఇండియాను పోలి ఉంది`` అని ఒక నెటిజ‌న్‌ వ్యాఖ్యానించారు. ``వావ్... అజయ్ ని కఠినమైన కోచ్‌గా చూడటం చాలా ట్రీట్ అవుతుంది`` అని మరొకరు రాశారు.

నిజకథ ఆధారంగా రూపొందుతున్న `మైదాన్‌`కు అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి కీల‌క పాత్ర‌ను పోషించారు. గజరాజ్ రావుతో పాటు బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రలలో నటించారు. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2024లో విడుదల కానుంది.