ఖలేజా రీ రిలీజ్ రైట్స్.. రేటు ఎంతంటే?
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 2010లో విడుదలైన ‘ఖలేజా’ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 12 May 2025 4:47 AMమహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 2010లో విడుదలైన ‘ఖలేజా’ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మే 30న ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం రీ రిలీజ్ కానుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లు రాకపోయినప్పటికీ, కాలక్రమంలో ఈ సినిమా మహేష్ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
రాజు అనే టాక్సీ డ్రైవర్‌గా మహేష్ బాబు, సుభాషిణి పాత్రలో అనుష్క శెట్టి నటనతో ఈ చిత్రం అలరించింది. మణిశర్మ సంగీతం, ప్రకాశ్ రాజ్ విలనిజం సినిమాకు బలంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ‘ఖలేజా’ రీ రిలీజ్ గురించి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా కథలో రాజు ఒక గ్రామాన్ని రక్షించే ప్రయత్నంలో ఎదుర్కొనే సవాళ్లు, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపి అభిమానులకు థియేటర్స్ఓ మళ్ళీ ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకంతో ఉన్నారు.
అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలు, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, ఇప్పుడు టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో భారీ ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో మే 30న 4Kలో రీ రిలీజ్ అవుతున్న ‘ఖలేజా’ అభిమానులకు పండగలా ఉండనుంది. ‘ఖలేజా’ రీ రిలీజ్ రైట్స్ పై ఒక టాక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రైట్స్ దాదాపు రూ.2 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఆంధ్రలో క్రౌన్ ఫిల్మ్స్, సీడెడ్‌లో నాగార్జున ఫిల్మ్స్, నిజాంలో అశ్విన్ కుమార్ ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నారని సమాచారం. ఇక మే 30న ‘ఖలేజా’ రీ రిలీజ్‌కు ముందు ‘హరిహర వీరమల్లు’, ‘కింగ్‌డమ్’ సినిమాలు ఈ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ రెండు సినిమాలు వాయిదా పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘ఖలేజా’ రీ రిలీజ్‌కు భారీ స్క్రీన్ కౌంట్ దక్కే అవకాశం ఉంది, అలాగే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది.
‘ఖలేజా’ సినిమా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘అతడు’ తర్వాత వచ్చిన రెండో చిత్రం. ఈ సినిమా అప్పట్లో మహేష్ బాబు మూడేళ్ల విరామం తర్వాత విడుదలైంది. అయితే, ఈ సినిమా కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుని, అభిమానులకు ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. ఇక ఈ రీ రిలీజ్ 4Kలో ఉండటంతో సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.